ఆత్మకూరులో ఏం జరిగింది?

చంద్రబాబు పల్నాడులో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ ఆందోళనకు సిద్ధమయ్యారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పోటీగా వైసీపీ నేతలు కూడా కోడెల, యరపతినేని బాధితులతో ఆత్మకూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పల్నాడులో 144 సెక్షన్ విధించారు పోలీసులు. భారీగా మోహరించారు.

అయితే చంద్రబాబు వెళ్తున్న ఆత్మకూరులో అసలేం జరిగింది?. గ్రామస్తులు మీడియా ముందుకు వచ్చి అసలు విషయాలు చెబుతున్నారు. చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు.

ఆత్మకూరు గ్రామంలో ఒక సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు కొన్నేళ్లుగా రెండుగా చీలిపోయాయి. వారంతా దగ్గరి బంధువులే, ఇచ్చిపుచ్చుకున్న వారే. కుటుంబ తగదాలతో వారంతా రెండుగా చీలిపోయారు. వీరంతా తొలి నుంచి టీడీపీలో ఉన్నవారే. ఒకే కాలనీలో నివాసం ఉండేవారు. రెండేళ్ల క్రితం బంధువుల్లోని ఒక వర్గం మరో వర్గంపై దాడి చేసింది. దాంతో భయపడిపోయిన బాధిత వర్గం… ఆ కాలనీని వదిలేసి మరోకాలనీలోకి వచ్చి ఉంటోంది.

ప్రభుత్వం మారడంతో రక్షణ ఉంటుందన్న ఉద్దేశంతో రెండేళ్ల క్రితం కాలనీ వదిలి వెళ్లిన వారు తిరిగి తమ పాత కాలనీకి వచ్చారు. అలా వచ్చిన తర్వాత కూడా ఎలాంటి గొడవలూ జరగలేదు. రెండేళ్ల క్రితం కాలనీ వదిలి వెళ్లిన వారు తిరిగి రావడంతో అప్పటి వరకు ఆ కాలనీలో ఆధిపత్యం చెలాయించిన టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబు ఏర్పాటు చేసిన శిబిరానికి వెళ్లిపోయారు. ఇప్పుడు టీడీపీ వారిని గ్రామం నుంచి తరిమేశారంటూ చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు.

ఈ అంశంపై పలువురు గ్రామస్తులు మీడియా చానళ్ల వద్ద స్పందించారు. చలో ఆత్మకూరు అని చంద్రబాబు పిలుపునిచ్చిన తర్వాత ఇతర గ్రామస్తులు ఫోన్లు చేసి ఏం జరుగుతోందని ఆరా తీస్తున్నారని.. ఇక్కడ తమంతా పొలం పనులు చేసుకుంటుంటే చంద్రబాబు వల్ల తమ గ్రామంలో ఏదో జరిగిపోతోందన్న భావన బయటి ప్రపంచంలో ఏర్పడిందని ఒక రైతు ఆవేదన చెందారు.

”గ్రామంలో గతంలో గొడవపడ్డ వారు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వారంతా చుట్టాలు. వాళ్లు వాళ్లు కొట్టుకుంటే… దాన్ని ఊరి మధ్య చిచ్చుగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఇలాంటి పనికిమాలిన ప్రచారం ఎందుకు చేస్తున్నారు?. తమ గ్రామంపై ఫ్యాక్షన్ ముద్ర వేస్తున్నారు. దీని వల్ల ఈ ఊరికి అమ్మాయిలను కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు” అని మరో పెద్దాయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

”వారంతా ఒకే వర్గం వారు. రెండేళ్ల క్రితం అల్లుడి మీదే మామ దాడి చేయించాడు. దాంతో కొన్ని కుటుంబాలు కాలనీ వదిలి పక్క కాలనీకి వచ్చాయి. ప్రభుత్వం మారిన వెంటనే వారు తిరిగి పాత ఇళ్లకు వెళ్లిపోయారు. దాంతో మరో కుటుంబం వారు చంద్రబాబు శిబిరానికి వెళ్లిపోయారు. వీరు వాళ్లను కొట్టింది లేదు… దాడి చేసింది లేదు. చంద్రబాబు వల్ల మా గ్రామంలో ఏదో జరుగుతోందని… మా గ్రామంలో వారంతా చెడ్డవాళ్లు అన్న ప్రచారం జరుగుతోంది. మా గ్రామానికి పిల్లను ఇచ్చే వారు కూడా ముందుకు రారు” అని మరో రైతు వాపోయారు.