కాంగ్రెస్ ను వీడలేక.. బీజేపీలో చేరలేక..

మామూలుగా ఒక పార్టీలో ఉంటూ అదే పార్టీని తిడితే ఏమవుతుంది.. వెంటనే పార్టీ అధిష్టానం సదురు ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటూనే ‘‘బీజేపీనే తెలంగాణలో అధికారంలోకి వస్తుంది.. బలపడుతుంది’’ అని కామెంట్లు చేస్తున్నా ఆయనను ఎవరూ పట్టించుకోని వింత పరిస్థితి కాంగ్రెస్ లో కనిపిస్తోంది.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశ్చర్యకర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ ను తిడుతూ బీజేపీని పొగుడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ఒంటరైపోయాడు. ఇటు గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలవకుండా.. అటు తాను పొగుడుతున్న పార్టీ నుంచి గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే తో కలువకుండా ఒంటరిగా కూర్చోవడం చర్చనీయాంశమైంది.

తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒంటరైపోయాడు. కాంగ్రెస్ ను అంత తిడుతున్నా పార్టీ అధిష్టానం ఈయనను సస్పెండ్ చేయడం లేదు. పోనీ బీజేపీపై ప్రేమ ఒలకబోస్తున్న ఈయన కాంగ్రెస్ ను వీడి కమలం పార్టీలో చేరడం లేదు. ఇలా కక్కలేక మింగలేక రాజగోపాల్ అసెంబ్లీలో ఒంటరైపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కోమటిరెడ్డి బ్రదర్స్ ది ఎప్పుడూ ఒకే మాట ఒకేబాణం. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా గెలవడంతో ఇప్పుడు అన్నను విడిచి బీజేపీలో చేరలేని పరిస్థితి రాజగోపాల్ కు వచ్చింది. అలా అని కునారిల్లుతున్న కాంగ్రెస్ లో కొనసాగలేని పరిస్థితిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.. అందుకే ఇప్పుడు రాజకీయాల్లో ఎటూకాకుండా ఒంటరైపోతున్నాడట రాజగోపాల్ రెడ్డి.