అన్ని వసతులు ఉంటేనే ప్రైవేటు కళాశాలలకు అనుమతి

రాష్ట్రంలో ప్రైవేటు కళాశాలలు ఏర్పాటు చేయాలనుకునే వారు అన్ని వసతులు చూపిస్తేనే అనుమతులు ఇస్తామని, వసతులు ఏర్పాటు చేయని వారికి అనుమతులు ఇచ్చేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

“ప్రైవేటు కళాశాలల్లో తరగతి గదులు విశాలంగా ఉండాలి. విద్యార్థుల కోసం ఆటస్థలం ఉండాలి. సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి. భద్రతా ప్రమాణాలను పాటించాలి. ఇవన్నీ చూపించిన వారికి కళాశాలలను ఏర్పాటు చేసేందుకు వెంటనే అనుమతి ఇస్తాం” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రతి మండలంలోనూ ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసే దిశగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రైవేటుకు ధీటుగా మంచి విద్యను అందించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు.

తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్యకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హై స్కూల్స్ అన్నింటిని ఓ క్రమపద్ధతిలో జూనియర్ కళాశాల స్థాయికి తీసుకు రావాలని సీఎం ఆదేశించారు.

“రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ జూనియర్ కళాశాల ఉండేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. ఈ పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి” అని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను బోధించాలని, ఆ తర్వాత దీనిని దశల వారీగా 9, 10 తరగతులకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

“ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది టీచర్లకు ఇంగ్లీష్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ శిక్షణా కార్యక్రమం చక్కగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నాం కదా అని తల్లిభాష తెలుగును చులకనగా చూడరాదని, తెలుగు భాష బోధన కూడా సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడంలో భాగంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 44,512 పాఠశాలలను బాగుచేసే పనిని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

“నాడు- నేడులో భాగంగా తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 15,410 పాఠశాలలను ఉన్నతీకరించాలని నిర్ణయించాం. ఈ పాఠశాలలో తొమ్మిది రకాల మౌలిక వసతులు కల్పిస్తాం” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా తొలిదశలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధిని వచ్చే సంవత్సరం మార్చి 14 నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించాను.