మనం పాలకులము కాదు సేవకులం

“ప్రజలు మనకు ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెట్టింది రాజుల్లా పరిపాలించమని కాదు. సేవకుల్లా వారికి సేవలు చేయమని. రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు ఈ విషయాన్ని గుర్తెరిగి వ్యవహరించాలి” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులతో అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమంపై సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలపై కొందరు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారని, మరి కొందరు తిరస్కరణ భావం చూపిస్తున్నారని తనకు నివేదికలు వచ్చాయని, వాటిని తాను సహించనని సీఎం ఉన్నతాధికారులతో కాస్త కటువుగానే అన్నట్లు సమాచారం.

“మనం చేసే పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉంటేనే తిరిగి మనం ఇక్కడ కూర్చుంటాం” అని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

స్పందన కార్యక్రమంలో తమ వినతులు ఇచ్చే వారి పట్ల చులకనగా వ్యవహరిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారు రెండు నుంచి ఐదు శాతం వరకు ఉన్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.

“ పని భారం ఎక్కువ కావడం వల్లో, కుటుంబ సమస్యల వల్లో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవచ్చు. అయితే వాటిని విడనాడి ప్రజల పట్ల స్నేహభావంతో ఉండాలని అధికారులకు ఉన్నతాధికారులు చెప్పాలి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు దిశానిర్దేశం చేశారు.

“ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా 59 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందుతున్నారు. మిగిలిన 41 శాతం మంది కూడా సంతృప్తి వ్యక్తం చేసేలా అధికారులు పని చేయాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇలా అసంతృప్తి వ్యక్తం చేసిన వారితో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ర్యాండంగా ప్రశ్నించారని, వారు ఇచ్చిన సమాధానాలను ఆయా జిల్లాలకు చెందిన అధికారులను పిలిపించి వారికి చూపిస్తామని సీఎం తెలిపారు.

అధికారులు చేసే ప్రతి పనిలోనూ మానవత్వం కనిపించాలని, అలా చేసినప్పుడే మన పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు.

ఆటో, కార్లకు సంబంధించిన డ్రైవర్ కమ్ ఓనర్ లకు ప్రభుత్వం ఇచ్చే పది వేల రూపాయల నగదు సహాయాన్ని వారికి నేరుగా అందించాలని సీఎం చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేయాలని, ఏ ఒక్కరూ తమకు సహాయం అందలేదని ఫిర్యాదు చేయకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.