గోపీచంద్ అప్పుడే పార్టీ మార్చేశాడు

మొన్నటివరకు తిరు అనే దర్శకుడితో కలిసి సినిమా చేశాడు. జస్ట్ 3 రోజుల కిందటే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్, రిలీజ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇంతలోనే పార్టీ మార్చేశాడు హీరో గోపీచంద్. ఇవాళ్టి నుంచి మరో సినిమా సెట్స్ పైకి చేరిపోయాడు.

అవును.. గోపీచంద్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. చాణక్య సినిమా సెట్స్ పై ఉంటుండగానే బీవీఎస్ఎన్ ప్రసాద్ కు చెందిన ఎస్వీసీసీ బ్యానర్ పై కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాతో బిను సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హీరోయిన్, టెక్నీషియన్స్ లాంటి సెలక్షన్లు లేకుండానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

చాన్నాళ్ల నుంచి గోపీచంద్ వద్ద బీవీఎస్ఎన్ అడ్వాన్స్ పెండింగ్ లో ఉంది. కానీ మంచి కథ సెట్ అవ్వక ఇద్దరూ కలిసి సినిమా చేయలేకపోయారు. ఎట్టకేలకు వీళ్లిద్దరికీ కామన్ గా మరో అడ్వెంచరస్ థ్రిల్లర్ నచ్చింది. ఆ కథనే ఇప్పుడు సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. ఇంతుకుముందు కూడా వీళ్లిద్దరూ కలిసి సాహసం అనే అడ్వెంచరస్ థ్రిల్లర్ ను చేసిన సంగతి తెలిసిందే.