విమానంలో సాంకేతిక లోపం…. రాష్ట్రపతికి తప్పిన భారీ ప్రమాదం

భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు తృటితో భారీ ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి లోపాన్ని ముందుగానే గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఐస్ లాండ్ నుంచి కోవింద్ స్విట్జర్లాండ్ కు బయలు దేరారు. అక్కడ పర్యటన ముగించుకొని స్లోవేకియా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జ్యూరిచ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

అయితే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రయాణించే ఎయిర్ ఇండియా వన్ విమానంలో చివరి నిమిషయంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమాన రూడర్ లో సమస్య ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది వెంటనే దాన్ని గుర్తించి విమానాన్ని నిలిపివేశారు.

వెంటనే రాష్ట్రపతిని అక్కడి నుంచి హోటల్ కు తీసుకెళ్ళారు… ఇంజనీర్లు విమానంలోని లోపాలను సరిచేశారు. దాదాపు 3 గంటల తర్వాత అదే విమానంలో రాష్ట్రపతి స్లోవేకియాకు వెళ్లారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా భారీ విమాన ప్రమాదం జరిగి ఉండేది. సిబ్బంది జాగ్రత్తతో ఈ ప్రమాదం తప్పింది.