తగ్గిన మద్యం అమ్మకాలు… బార్ల వేళల కుదింపు దిశగా…

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలకు టార్గెట్లు పెట్టడంతో భారీగా అమ్మకాలు జరిగాయి. దానికి తోడు బెల్ట్‌ షాపుల కారణంగా గ్రామాల్లోనూ మద్యం నిత్యం అందుబాటులో ఉంటూ వచ్చింది. దాంతో ప్రజల ఆరోగ్యం, కుటుంబాల పరిస్థితి ఎలా ఉన్నా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేది. గత ప్రభుత్వం దగ్గరుండి మద్యం వాడకాన్ని ప్రోత్సహించింది.

దశల వారీగా మద్యాన్ని లేకుండా చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన జగన్‌… ఆ దిశగా చేపట్టిన చర్యలు ఫలితానిస్తున్నాయి. గతేడాది ఆగస్ట్‌ నాటికి వచ్చిన ఆదాయంతో… ఈ ఏడాది ఆదాయాన్ని పోలిస్తే 678.03 కోట్లు తగ్గింది. టార్గెట్లు లేకపోవడం, బెల్ట్‌ షాపులను నిషేదించడం వల్ల మద్యం వినియోగం ఆ మేరకు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. మునుముందు మరింత తగ్గుదల ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మద్యం షాపుల నిర్వాహణను పూర్తిగా ప్రభుత్వమే చేపడుతున్న నేపథ్యంలో… విచ్చలవిడి అమ్మకాలకు చెక్ పడినట్టే. ఇప్పటికే రాష్ట్రంలో 400 మద్యం షాపులను నేరుగా ప్రభుత్వమే నడుపుతోంది. అక్టోబర్ 1 నుంచి మద్యం షాపులన్ని ప్రభుత్వమే నిర్వహించనుంది. ప్రైవేట్ వైన్‌ షాపులు ఇక కనిపించవు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 4380 మద్యం షాపులు ఉండగా… వాటిని 20 శాతం మేర తగ్గించారు. అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్రంలో 3500 మద్యం షాపులు మాత్రమే ఉంటాయి.

2018 సెప్టెంబర్‌ వరకు మద్యం విక్రయం 198 లక్షల కేసులుగా ఉండేది… కానీ ఈ ఏడాది సెప్టెంబర్ 28 నాటికి మద్యం విక్రయాలు 164 లక్షల కేసులకు పడిపోయింది.

అటు బార్ల వేళలపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటి వరకు మద్యం షాపులు కూడా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండేవి. కానీ ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులు రాత్రి 9 గంటల వరకే పనిచేస్తాయి.

బార్లకు ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉంది. ఆహారం సరఫరా పేరుతో బార్లను 12 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో బార్ల సమయాన్ని కుదించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.