విశాఖటెస్టులో రోహిత్ శర్మ రికార్డుల మోత

  • ఓపెనర్ గా రెండు ఇన్నింగ్స్ లోనూ రోహిత్ సెంచరీలు
  • సిక్సర్లబాదుడులో రోహిత్ సరికొత్త రికార్డు

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో సైతం తన బ్యాట్ పవర్ ఏంటో…ప్రపంచానికి చాటి చెప్పాడు. విశాఖపట్నంలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలిటెస్ట్ లో రికార్డుల మోత మోగించాడు. ఓపెనర్ గా తన తొలిమ్యాచ్ లోనే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో పాటు… సిక్సర్ల వర్షం కురిపించాడు.

ఒకేఒక్కడు రోహిత్ శర్మ…..

ఓపెనర్ గా తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ లోనే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. తొలిఇన్నింగ్స్ లో 176 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేసిన రోహిత్…రెండో ఇన్నింగ్స్ లో సైతం అదేజోరు కొనసాగించాడు. కేవలం 149 బాల్స్ లోనే 127 పరుగులతో మెరుపు సెంచరీ సాధించాడు.

భారత క్రికెట్ చరిత్రలో ఓ టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ సునీల్ గవాస్కర్ సరసన రోహిత్ శర్మ నిలిచాడు.

టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు బాదిన భారత ఆరవ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

విజయ్ హజారే, సునీల్ గవాస్కర్ మూడుసార్లు, రాహుల్ ద్రావిడ్ రెండుసార్లు, విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే ఒక్కోసారి..ఈ ఘనత సాధించగలిగారు.

సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ…

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 మ్యాచ్ ల్లో మాత్రమే కాదు…సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో సైతం సిక్సర్ల బాదుడులో రోహిత్ తనకుతానే సాటిగా నిలిచాడు.

భారత ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధూ, పాక్ ఆల్ రౌండర్ వాసిం అక్రం పేర్లతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డులను రోహిత్ తెరమరుగు చేశాడు.

విశాఖ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్…రెండో ఇన్నింగ్స్ లో ఏడు సిక్సర్లతో…సఫారీ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.

అక్రం రికార్డు ను అధిగమించిన రోహిత్…

టెస్ట్ క్రికెట్ చరిత్రలో…ఓ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడి రికార్డు పాక్ ఆల్ రౌండర్ వాసిం అక్రం పేరుతో ఉంది. 1996లో జింబాబ్వేతో జరిగిన  టెస్ట్ మ్యాచ్ లో అక్రం 12 సిక్సర్లు బాదడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

గత 23 సంవత్సరాలుగా అక్రం పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ 13 సిక్సర్లతో తెరమరుగు చేశాడు.

అంతేకాదు…అత్యధిక సిక్సర్లు బాదిన భారత టెస్ట్ ఓపెనర్ గా నవజోత్ సింగ్ సిద్ధూ పేరుతో ఉన్న రికార్డును సైతం రోహిత్ అధిగమించాడు.

లక్నో వేదికగా 25 సంవత్సరాల క్రితం జరిగిన టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంకపై సిద్ధూ సాధించిన 12 సిక్సర్లే ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్  రికార్డుగా ఉంది.

విశాఖ టెస్టులో రోహిత్ ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో మూడు ప్రపంచ రికార్డులు కేవలం రెండు సెంచరీలతో పటాపంచలయ్యాయి.

రెండు ఇన్నింగ్స్ల్ లోనూ స్టంపౌట్ గా వెనుదిరిగిన భారత ఏకైక టెస్ట్ క్రికెటర్ గా కూడా రోహిత్ శర్మ ఓ రికార్డును తన పేరుతో పదిలం చేసుకొన్నాడు.