మహిళా క్రికెట్లో రెండు దశాబ్దాల మిథాలీ…రాజ్

  • 1999 నుంచి వన్డే క్రికెట్లో కొనసాగుతున్న మిథాలీ

భారత ఎవర్ గ్రీన్ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్.. రెండుదశాబ్దాల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కొనసాగించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

వడోదర వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలివన్డేలో పాల్గొనడం ద్వారా మిథాలీ ఈ ఘనతను సొంతం చేసుకొంది.

1999 జూన్ 26న ఐర్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన మిథాలీ నాటినుంచి ప్రస్తుత 2019 వన్డే సిరీస్ వరకూ తన కెరియర్ ను విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చింది.

204 వన్డేలు, 89 టీ-20 మ్యాచ్ లు..

మిథాలీ 20 సంవత్సరాల 105 రోజుల తన క్రికెట్ ప్రస్థానంలో 204 వన్డే మ్యాచ్ లు, 89 టీ-20 మ్యాచ్ లు , 10 టెస్టులు ఆడిన రికార్డు సొంతం చేసుకొంది.

అంతేకాదు… మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేమ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా నిలిచింది. 36 సంవత్సరాల మిథాలీరాజ్ 204 వన్డేలతో అగ్రస్థానంలో నిలిస్తే…చార్లొట్టీ ఎడ్వర్డ్స్ 191, జులన్ గోస్వామి 178, అలెక్స్ బ్లాక్ వెల్ 144 వన్డేలతో ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.

క్రికెట్ చరిత్రలోనే అతిసుదీర్ఘ కాలం… 22 సంవత్సరాల 91 రోజులపాటు మాస్టర్ సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెటర్ గా తన కెరియర్ ను కొనసాగించాడు.

శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య 21 సంవత్సరాల 184 రోజులు, జావేద్ మియాందాద్ 20 సంవత్సరాల 272 రోజులపాటు అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ను కొనసాగిస్తే… మిథాలీ 20సంవత్సరాల 105 రోజులతో నాలుగో స్థానంలో నిలవడం విశేషం.

క్రికెట్ కెరియర్ కోసం వివాహాన్నే వాయిదా వేసుకొంటూ వచ్చిన 36 ఏళ్ల మిథాలీరాజ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.