గుర్రపు పందాలతో వెంకీకి లింక్ ఏంటి?

చాలామందికి క్రికెట్ బెట్టింగ్ మాత్రమే తెలుసు. కానీ దీనికంటే అత్యంత భారీ ఎత్తున జరిగేది, అత్యంత ప్రమాదకరమైనది, ప్రాచీనమైన బెట్టింగ్ ఇంకోటి ఉంది. అదే గుర్రపు పందాలు. అవును.. గుర్రపు పందాల్లో లక్షలు తగలేసుకొని, జీవితాల్ని నాశనం చేసుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. బయటకు ఇది పెద్దగా ప్రాచుర్యంలో లేకపోయినా తెరవెనక ఈ పందాలు జోరుగా సాగుతుంటాయి. ఇలాంటి ఎలిమెంట్ ను తన నెక్ట్స్ సినిమాలో చర్చించబోతున్నాడు వెంకటేష్.

అవును.. వెంకీ మామ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా ఇదే. అది కూడా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కావడం విశేషం. ఇప్పటివరకు ఎంటర్ టైనర్స్ మాత్రమే తీశాడు తరుణ్ భాస్కర్. ఫస్ట్ టైమ్ గుర్రపు పందాల్లాంటి సీరియస్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ కథాంశం చుట్టూ అల్లుకున్న కథతో తరుణ్ భాస్కర్ చెప్పిన స్క్రీన్ ప్లే వెంకీకి బాగా నచ్చింది. వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

అంతేకాదు.. ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు వెంకీ. ఈ హీరోకు తెలంగాణలో డైలాగ్స్ చెప్పడం కొత్తకాదు. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో మళ్లీ ట్రై చేయలేదంతే. ఇన్నాళ్లకు తరుణ్ భాస్కర్ సినిమాతో ఆ లోటు కూడా తీరబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుంది.