పతకం, ప్రైజ్ మనీ అమ్మకే అంకితం

  • కష్ట్రాలతో రాటుదేలిన జమునా బోరో
  • ప్రపంచబాక్సింగ్ కాంస్యవిజేత జమున
  • పేదరికానికి బాక్సింగ్ పంచ్

రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా ముగిసిన 2019 ప్రపంచ మహిళా బాక్సింగ్ లో భారత బాక్సర్ జమునా బోరో కాంస్య పతకం సాధించడం ద్వారా నిజమైన విజేతగా నిలిచింది.

ఆరేళ్ల వయసు నుంచే పేదరికంలో మగ్గి…పేదరికంతో పోరాడుతూ ఎదిగిన జమున బోరో చివరకు బాక్సింగ్ అస్త్రంగా పేదరికానే జయించడం ద్వారా వారేవ్వా అనిపించుకొంది.

పేదరికంతో సహజీవనం…

అసోంలోని సోనిట్ పూర్ జిల్లా బెలిసిరీ గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన జమునా బోరో..ఇద్దరు సోదరులు, తల్లి నిర్మలతో కలసి…ఒక్క గది ఇంటిలోనే బాల్యాన్ని గడిపింది. రెండుపూటలా తిండికి గతిలేని ఇంట జన్మించిన జమున ఆరేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకొంది. నాటినుంచి తల్లి నిర్మలే తండ్రిగా మారి తనను, తన సోదరులను పెంచుతూ వచ్చింది.
రోడ్డుపక్కనే కూరగాయలు విక్రయిస్తూ వచ్చిన కొద్దిమొత్తంతోనే పిల్లల్ని సాకుతూ వచ్చింది.

ఉషుతో మొదలై…

బాల్యం నుంచే జమున బోరోకు ఆటలంటే ఎంతో ముక్కవ. తల్లి ప్రోత్సాహంతో 12 సంవత్సరాల వయసు వరకూ ఉషు మార్షల్ ఆర్ట్ లో శిక్షణ పొందుతూ వచ్చింది.

శిక్షణ తర్వాత కూరగాయాల విక్రయంలో తల్లి నిర్మలకు జమున తోడుగా ఉంటూ ఉండేది.

శిక్షణ కోసం సోనిట్ పూర్ జిల్లాలోని బెలిసిరీ గ్రామం నుంచి పొరుగునే ఉన్న ఉడాల్ గురి జిల్లాకు రోజూ వెళ్లివస్తూ ఉండేది. ఉషు క్రీడలో జమున శిక్షణకు అవసరమైన మొత్తాన్ని తల్లి నిర్మలే సమకూర్చుతూ వచ్చేది. కూరగాయలు అమ్మగా వచ్చిన ఆదాయంలో కొంతభాగాన్ని జమున కోసం ఖర్చు చేస్తూ వచ్చింది.

12 సంవత్సరాల వయసులో ఉషును విడిచిపెట్టి బాక్సింగ్ క్రీడలోకి ప్రవేశించిన జమున..గౌహతీ నగరంలోని సాయి కేంద్రంలో శిక్షణ కోసం ఎంపిక కావడంతో.. కొంతమేరకు ఆర్థిక కష్టాలు తీరాయి.

2010 నుంచి బాక్సింగ్ జోరు…

2010 నుంచి 2012 వరకూ జాతీయ సబ్ జూనియర్ మహిళల బాక్సింగ్ 54 కిలోల విభాగంలో పాల్గొంటూ వచ్చిన జమున పలు పతకాలు గెలుచుకోడం ద్వారా చక్కటి బాక్సర్ గా గుర్తింపు సంపాదించుకొంది. 

అభిషేక్ మాలవ్యా శిక్షణలో జమున అంతర్జాతీయ బాక్సర్ గా రూపుదిద్దుకొంది. 2013 నుంచి 2015 వరకూ సెర్బియా, బల్గేరియా, చైనీస్ తైపీ దేశాలలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలలో పాల్గొనడం ద్వారా బంగారు పతకాలు సాధించిన జమున 10 తరగతి పరీక్షలకు సిద్ధమవుతూనే బాక్సింగ్ శిక్షణ కొనసాగించింది.

2016 నుంచి 2018 మధ్యకాలంలో వరుస పరాజయాలతో ఆత్మరక్షణలో పడిపోయిన జమున 2018 జాతీయ బాక్సింగ్ టైటిల్ సాధించడం ద్వారా తిరిగి పుంజుకొంది.

ఇండియన్ ఓపెన్, ఇండోనీషియా వేదికగా ముగిసిన ప్రెసిడెంట్స్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలలో జమునా బోరో బంగారు పతకాలు సాధించడం ద్వారా… భారత సీనియర్ జట్టులో తొలిసారిగా చోటు సంపాదించింది.

రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బాక్సింగ్ మహిళల 54 కిలోల విభాగం బరిలోకి దిగిన జమునా బోరో మొదటి మూడురౌండ్లలో అలవోక విజయాలు సాధించడం ద్వారా సెమీఫైనల్స్ చేరడం ద్వారా కాంస్య పతకం ఖాయం చేసుకోగలిగింది.

ఫైనల్లో చోటు కోసం చైనీస్ తైపీ బాక్సర్ హాంగ్ సియావోతో జరిగిన పోరులో పోరాడి ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకొంది. ప్రపంచ బాక్సింగ్ సీనియర్ విభాగంలో తొలిసారిగా పాల్గొన్న 23 ఏళ్ల జమునా కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగి వచ్చింది.

ప్రపంచ పోటీల కాంస్య పతకంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3 లక్షల రూపాయల నజరానాను తన కోసం నానాకష్టాలు పడిన తల్లినిర్మలకే ఇస్తానని.. ఆమెను ఇక కష్టపడబోనివ్వనని జమున ప్రకటించింది.

అసోం రైఫిల్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన జమున ప్రస్తుతం తన కుటుంబానికి పెద్దదిక్కుగా మారింది. బాల్యం నుంచి తమ కోసం జీవితాన్ని అంకితం చేసిన కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకొంటానని…బాక్సింగ్ తో పేదరికాన్ని జయించడం గర్వకారణమని జమునా బోరో పొంగిపోతోంది.