ప్రో-కబడ్డీ లీగ్ నయా చాంపియన్ బెంగాల్ వారియర్స్

  • ఫైనల్లో పోరాడి ఓడిన దబాంగ్ ఢిల్లీ

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత మూడుమాసాలుగా అలరిస్తూ వచ్చిన ప్రో-కబడ్డీ లీగ్ 7వ సీజన్ టైటిల్ ను బెంగాల్ వారియర్స్ గెలుచుకోడంతో.. సీజన్ కు తెరపడింది.

అహ్మదాబాద్ ఏకా ఎరీనా వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో డార్క్ హార్స్ బెంగాల్ వారియర్స్ 4 పాయింట్ల తేడాతో హాట్ ఫేవరెట్ దబాంగ్ ఢిల్లీ పై సంచలన విజయం సాధించింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ సమరంలో స్టార్ రైడర్ నవీన్ కుమార్ ఒంటరిపోరాటం చేసినా దబాంగ్ ఢిల్లీకి పరాజయం తప్పలేదు. ఆల్ రౌండ్ గేమ్ తో బెంగాల్ వారియర్స్ ..దబాంగ్ ఢిల్లీని కట్టడి చేసి 39-34 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది.

నవీన్ కుమార్ 300 రికార్డు…

ప్రస్తుత సీజన్లో 301 పాయింట్లు సాధించిన దబాంగ్ ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ట్రోఫీ దక్కింది. నవీన్ కు ట్రోఫీతో పాటు 20 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది.

టైటిల్ విన్నర్ బెంగాల్ వారియర్స్ 3 కోట్ల రూపాయలు, రన్నరప్ దబాంగ్ ఢిల్లీ కోటీ 80 లక్షల రూపాయలతో సరిపెట్టుకొన్నాయి.

మొదటి ఆరుస్థానాలలో నిలిచిన జట్లకు 45 లక్షల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకూ ప్రైజ్ మనీ అందచేశారు.

మొత్తం మీద… మూడుసార్లు విజేత పట్నా పైరేట్స్ , మాజీ చాంపియన్లు జైపూర్ పింక్ పాంథర్స్, యూ-ముంబా, బెంగళూరు బుల్స్ జట్లు 7వ సీజన్ ఫైనల్స్ చేరుకోడంలో విఫలం కాగా…దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ టైటిల్ సమరానికి అర్హత సాధించడంతో…సరికొత్త చాంపియన్ గా బెంగాల్ వారియర్స్ నిలిచింది.