కొత్త కుర్రాడు.. ఓ సినిమా పిచ్చోడు

గల్లా జయదేవ్ కొడుకు, కృష్ణ మనవుడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా మారాడు. నిన్ననే అతడి కొత్త సినిమా లాంఛ్ అయింది. రామానాయుడు స్టుడియోస్ లో జరిగిన ఈ లాంఛింగ్ కోసమే ఏకంగా 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారట. అలా గ్రాండ్ గా లాంఛ్ అవుతున్న ఈ హీరో, తన కొత్త సినిమా కోసం ఏకంగా సినిమా బ్యాక్ డ్రాప్ నే సెలక్ట్ చేసుకున్నాడు.

అవును.. గల్లా అశోక్ తన కొత్త సినిమాలో సినిమాలంటే అమితమైన ఇష్టం కలిగిన అబ్బాయిగా కనిపించబోతున్నాడట. ఆ ఇష్టంతో అతడు ఏం చేశాడు.. తను ప్రేమించిన అమ్మాయిని కూడా ఒక దశలో వదులుకోవాల్సి వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనే పాయింట్ తో ఈ సినిమా రాబోతోందట. గతంలో దేవదాస్ లాంటి మల్టీస్టారర్ తీసిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడు. కథ-స్క్రీన్ ప్లే కూడా ఇతడిదే.

ఈ సినిమా కోసం గల్లా జయదేవ్ ఏకంగా నిర్మాతగా మారాడు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ అనే బ్యానర్ స్థాపించాడు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. నిన్నట్నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది ఈ సినిమా. అశోక్ తొలి సినిమాకే 30 కోట్ల బడ్జెట్ అంటే అది చాలా పెద్ద మొత్తం అని చెప్పుకోవాలి.