విజయవాడ రోడ్లపై గొడవలకు నేను సిద్ధం – పవన్‌ కల్యాణ్ సంచలన ప్రకటన

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ రోడ్ల మీద గొడవలు పెట్టుకుందామంటే అందుకు తాను సంతోషంగా రెడీ అని ప్రభుత్వానికి సవాల్ చేశారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన… విజయవాడ నడిఒడ్డున కూర్చునే తాను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని చెప్పారు. విజయవాడ రోడ్లపై గొడవలకు సిద్దమని మీడియా సమావేశం ఆఖరిలో ప్రకటించి పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు.

తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు. తాను చాలా సంస్కారవంతమైన వ్యక్తినన్నారు. ఆ విషయం ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

తనకు ముగ్గురు భార్యలన్న విషయాన్ని పదేపదే గుర్తు చేస్తుండడంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడుల మనవళ్లు, పవన్‌ కల్యాణ్ ముగ్గురు భార్యల ఐదుగురు పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో సామాన్య ప్రజలకు చెప్పాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి చేసిన డిమాండ్‌పై పవన్ తీవ్రంగా స్పందించారు.

కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి… ఎవరు వద్దన్నారు అంటూ ప్రశ్నించారు. పదేపదే మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు అంటున్నారని.. తానేమీ సరదా పడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని పవన్‌ మండిపడ్డారు. టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం నేర్పకుండా ఒకేసారి ఇంగ్లీష్ మీడియం తెస్తే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

వైసీపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నా… తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. ఇసుక సమస్యను తప్పుదోవ పట్టించేందుకు ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ మోహన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు.