పౌరుషం ఉంటే రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చెయ్…

టీడీపీ నేతలపై ఆరోపణలు చేసిన వల్లభనేని వంశీని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ వేటుపై వంశీ తీవ్రంగా స్పందించారు. తాను టీడీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని… అలాంటప్పుడు టీడీపీ తనను సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబుకు వయసు మీద పడి మైండ్ పనిచేయడం లేదన్నారు.

చంద్రబాబుకు పౌరుషం ఉంటే సస్పెండ్ చేయాల్సింది తనను కాదని… పార్టీ మారిన నలుగురు రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేయాలని సవాల్ చేశారు. నల్లబట్టలేసుకుని నరేంద్రమోడీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇప్పుడు దీక్ష చేయగలరా అని ప్రశ్నించారు.

తాను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని… ఆ ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారో అర్థం చేసుకోలేకపోవడానికి తానేమైనా పప్పునా అని వంశీ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ వాటిని స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు.

తనపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసన్నారు. ఎన్నికల సమయాల్లో సూట్‌కేసులు కొట్టేసేవాళ్లు కూడా తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుడ్డు ఎలా పెట్టాలన్నది కోడికి తెలుస్తుంది కానీ… పప్పుకు తెలుస్తుందా అని ప్రశ్నించారు.

టీడీపీకి రాజీనామా చేసిన తనపై కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఈ అంశంపై విజయవాడ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తనను కించపరిచేలా ఆడపిల్లల పేర్లతో ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. దీని వెనుక టీడీపీ సోషల్ మీడియా వింగ్‌ హస్తముందని సీపీ దృష్టికి తీసుకెళ్లారు.