మళ్లీ కలిసిన రాజ్ తరుణ్ హెబ్బా పటేల్

వీళ్లిద్దరిదీ హిట్ పెయిర్. కుమారి 21 ఎఫ్ లాంటి హిట్ సినిమాలో నటించారు. ఆ తర్వాత వీళ్లిద్దరి అనుబంధంపై కొన్ని రూమర్లు కూడా రావడంతో ఈ జంటకు మంచి హైప్ వచ్చింది. అయితే అవే పుకార్లు వీళ్లను విడదీశాయి కూడా. పుకార్లకు చెక్ పెట్టే ఉద్దేశంతో రాజ్ తరుణ్, హెబ్బా కలిసి నటించడం మానేశారు. అలా చాన్నాళ్లు సిల్వర్ స్క్రీన్ కు దూరమైన ఈ జంట, ఇప్పుడు మరోసారి కలిసింది. రాజ్ తరుణ్ కొత్త సినిమాలో హెబ్బ పటేల్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

రాజ్‌త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఒరేయ్ బుజ్జిగా. కొండా విజయ్ కుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కేకే రాధామోహన్ నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలోకి హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. తాజా షెడ్యూల్‌లో హెబ్బా ప‌టేల్ జాయిన్ అయింది. ఆమెపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. సినిమాలో మళవిక, హెబ్బా పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నాడు నిర్మాత.

అటు రాజ్ తరుణ్, ఇటు హెబ్బా ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. కచ్చితంగా ఇద్దరికీ ఓ హిట్ కావాలి. అందుకే ఇలా మరోసారి కలిసి నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమాను జనవరి నెలాఖరుకు లేదా ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు.