ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య.. కేంద్రం ఏమందంటే…

ఏపీలో వైఎస్ జగన్ సర్కారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం చదువు పార్లమెంట్ లోనూ దుమారం రేపింది. లోక్ సభ ఈరోజు ప్రారంభమైంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల ఏర్పాటు అంశం ఇప్పుడు లోక్ సభలో దద్దరిల్లింది.

ప్రాంతీయ భాషల పరిరక్షణపై లోక్ సభలో ఎంపీ కేశినేని నాని ప్రశ్న లేవనెత్తారు. సంస్కృతి, సంప్రదాయాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ ను తప్పనిసరి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

దీనిపై వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు దీనిపై స్పందించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద విద్యార్థులను ఉద్దేశించి తీసుకున్న మంచి నిర్ణయమని అన్నారు. తెలుగు భాషకు ఏపీలో ఏరకంగానూ విఘాతం కలుగదని అన్నారు.

కాగా సభలో ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై లొల్లి జరుగుతుండగా దీనిపై కేంద్ర మంత్రి పోఖ్రియాల్ స్పందించారు. మైసూర్ లోని తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను నెల్లూరుకు మార్చామని.. ప్రాంతీయ భాషలను పటిష్టం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. తెలుగు భాషను రక్షించడంతోపాటు ఆంగ్లాన్ని కొనసాగించవచ్చని కేంద్రమంత్రి తెలపడంతో ఈ వివాదానికి కేంద్రం పుల్ స్టాప్ పెట్టింది.