వెబ్ సిరీస్ వద్దు.. బిగ్ స్క్రీన్ ముద్దు

హీరోహీరోయిన్లంతా ఇప్పుడు వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా అంతా ఓ ప్రయత్నం చేద్దామన్నట్టు ఇందులో వేలు పెడుతున్నారు. తాజాగా సమంత కూడా వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మేన్ సీజన్2 లో ఆమె ఉగ్రవాదిగా కనిపించబోతోంది. ఇదే సిరీస్ లో సందీప్ కిషన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉంటున్నాడు హీరో నిఖిల్.

“చాలామంది నన్ను వెబ్ సిరీస్ చేయమని అడుగుతున్నారు. కానీ నాకు ఎందుకో వెబ్ సిరీస్ చేయడం ఇష్టం లేదు. నన్ను నేను బిగ్ స్క్రీన్ పై చూసుకోవడానికే ఇష్టపడతాను. చేసినది ఏదైనా పెద్ద తెరపై చూసుకుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అందుకే వెబ్ సిరీస్ కాన్సెప్టుల్ని కూడా సినిమాగా ఎలా మార్చాలా అని ఆలోచిస్తుంటాను. ప్రస్తుతానికైతే వెబ్ సిరీస్ కు నేను దూరం.”

ఇలా తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పేశాడు నిఖిల్. అర్జున్ సురవరం సినిమాను విడుదలకు సిద్ధంచేసిన ఈ హీరో, ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. మల్టీస్టారర్ సినిమాలంటే తనకు ఇష్టమన్న ఈ నటుడు, రానాతో ఈమధ్య అలాంటి ఓ ఆఫర్ వచ్చిందని, కానీ కథ నచ్చక వదిలేశానని చెబుతున్నాడు. ఈరోజు అర్జున్ సురవరం థియేట్రికల్ ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు.