అదునుచూసి టీడీపీని దెబ్బకొట్టిన వైసీపీ

వైసీపీ సర్కారు అదును చూసి దెబ్బకొట్టింది. చంద్రబాబు సీఎంగా చేసిన భూముల పందేరంపై కొరఢా ఝలిపించింది.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు తన సొంత పార్టీకి కేవలం రూ.1000కే 70 కోట్ల స్థలాన్ని 99 ఏళ్లకు లీజుకిచ్చిన వైనం పై చర్యలు మొదలుపెట్టింది. ఆ స్థలం స్వాధీనం దిశగా అడుగులు వేస్తోంది.

చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో 2017 జూన్ 22న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని 99 ఏళ్లపాటు లీజుకు కేవలం ఏటా ఎకరానికి రూ.1000 కే కేటాయించడం దుమారం రేపింది. టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు ఇలా చేశాడని వైసీపీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు దీనిపై ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.

తాజాగా అమరావతి పరిధిలో గుంటూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం చంద్రబాబు కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని వైసీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారు. దాదాపు 70 కోట్లకుపైగానే విలువైన ఈ భూమిని టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ ధరకు టీడీపీకి కేటాయించిందని.. వెంటనే భూ కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని సీఎం జగన్ కు రాసిన లేఖలో కోరారు.

కాగా చంద్రబాబు హయాంలో లీజుకు తీసుకున్న ఈ స్థలంలో ఇప్పటికే బాబు…. ఆగమేఘాల మీద టీడీపీ ఆఫీసును కట్టేశారు. డిసెంబర్ 6న ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవడానికి వైసీపీ సర్కారు రెడీ కావడం విశేషం.