పవన్ దీక్ష…. ఎవరి కోసం…. ఎందుకోసం?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారు. అసలు ఎందుకు ఆయన దీక్ష చేస్తున్నారో తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పార్టీలోని వారే వపన్ వ్యవహార శైలిపై భయపడుతున్నారు. ధర్మాన్ని కాపాడేందుకే పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.

కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షను పవన్ చేపట్టారు. దీనిలో ఆయన చేసిన ప్రధానమైన డిమాండ్లు చూస్తే… అసలు పవన్ ఎటు వెళుతున్నారో అర్థం కాక పార్టీనేతలే కంగారు పడుతున్నారు.

కేంద్ర, రాష్ర్టాల్లో బల్లగుద్ది అడిగే శక్తిని మనం ఇవ్వాలి… బస్తాకు రూ.2,200 వస్తేనే రైతుకు గిట్టుబాటు…. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర కల్పించలేదు… ధాన్యం తీసుకుపోయారు, ఖాతాల్లో డబ్బులు పడలేదు… స్వయం సమృద్ది సాధించినా రైతుల బతుకులు మారలేదు…. ఇలాంటి ప్రకటనలతో జనాన్ని ఉర్రూతలూగించేలా పవన్ ప్రసంగించారు.

వీటిల్లో ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అమలు చేయాల్సినవి. మధ్దతు ధర, కొనుగోళ్లు వంటివాటిని కేంద్రం నిర్ణయించాలి. కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి) ని కేంద్రమే ప్రతి యేడాది ఖరీప్ పంట వచ్చే ముందు ప్రకటించాలి. కానీ ప్రతి యేటా రైతు నుంచి దళారుల దగ్గరకు ధాన్యం వెళ్లిపోయాక… ఎం.ఎస్.పి.ని ప్రకటిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్య.

దీనితో పాటు రైతుల భరోసా కింద రాష్ర్ట ప్రభుత్వం మొదటి విడత ఎకరాకు 7,500 రూపాయలు బ్యాంకు ఖాతాల్లో ఈపాటికే వేసింది. కేంద్రం ఇవ్వాల్సిన మొత్తం ఇంకా విడుదల చేయలేదు. ఇపుడు నిందించాల్సింది కేంద్రాన్ని. నిగ్గదీయాల్సింది కేంద్రాన్ని. వీటిని సాధించాలంటే ఢిల్లీలో దీక్ష చేయాలి…. కానీ కాకినాడలో చేస్తే ఉపయోగం ఏమి ఉంటుంది?

రైతుల నిజమైన సమస్యలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. వాటిని చిత్త శుద్దితో ప్రస్తావించాలి. వాటిపై నిజాయితీగా మాట్లాడాలి. రైతు సౌభాగ్య దీక్షకు హాజరయిన రైతులు ఎంతమంది? జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులే ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల సాధించేది ఏమి ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు.