400 సిక్సర్ల క్లబ్ లో రోహిత్ శర్మ

  • 404 సిక్సర్లతో భారత సిక్సర్లకింగ్ గా రోహిత్
  • గేల్, ఆఫ్రిదీల తర్వాతి స్థానంలో రోహిత్

భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సిక్సర్ల బాదుడులో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోంగ్రౌండ్ ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన ఆఖరి టీ-20లో రోహిత్ 5 సిక్సర్లతో సహా 71 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

మూడుఫార్మాట్లలో…..

అంతర్జాతీయ క్రికెట్లో 400 సిక్సర్ల రికార్డు సాధించిన భారత తొలి క్రికెటర్ రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో జమ చేసుకొన్నాడు. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి తన కెరియర్ లో ఇప్పటి వరకూ 404 సిక్సర్లు బాదిన రోహిత్ … కరీబియన్ దిగ్గజం క్రిస్ గేల్, పాక్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిదీల తర్వాతి స్థానంలో నిలిచాడు.

విండీస్ తో ముగిసిన ప్రస్తుత తీన్మార్ టీ-20 సిరీస్ కు ముందు వరకూ 399 సిక్సర్ల రికార్డుతో ఉన్న రోహిత్… హైదరాబాద్, తిరువనంతపురం వేదికలుగా ముగిసిన మొదటి రెండు టీ-20ల్లోనూ సిక్సర్ సాధించడంలో విఫలమయ్యాడు.

అయితే ఆలోటును హోంగ్రౌండ్ వాంఖెడీ స్టేడియంలో తీర్చుకోగలిగాడు.

అగ్రస్థానంలో క్రిస్ గేల్….

క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 534 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు విండీస్ సుడిగాలి ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో కలసి గేల్ 500కు పైగా సిక్సర్లు బాదిన తొలి, ఒకే ఒక్క క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిదీ 476 సిక్సర్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

రోహిత్ శర్మ 404 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఓ టెస్ట్ సిరీస్ లో అత్యధికంగా 19 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు సైతం రోహిత్ పేరుతోనే ఉంది.

రోహిత్ సాధించిన మొత్తం 404 సిక్సర్లలో…టెస్టు మ్యాచ్ ల్లో సాధించిన 52, వన్డేల్లో 232, టీ-20లో 120 సిక్సర్లు ఉన్నాయి.