మరోసారి మహేష్ సరసన…

మహేష్ పెద్దగా హీరోయిన్లను రిపీట్ చేయడు. అలా చేశాడంటే ఆ హీరోయిన్ కెరీర్ లో అది పెద్ద విషయం కిందే లెక్క. అలాంటి పెద్ద విషయమే శృతిహాసన్ కెరీర్ లో జరగబోతోంది. అవును.. మహేష్ ఈమెకు మరో ఆఫర్ ఇవ్వబోతున్నాడు. త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ పేరును పరిశీలిస్తున్నారు.

ఇంతకుముందు మహేష్-శృతిహాసన్ కాంబోలో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ తర్వాత ఆగడు సినిమాలో శృతిహాసన్ ఓ ఐటెంసాంగ్ కూడా చేసింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆమెకు అవకాశం ఇచ్చాడు మహేష్ బాబు. ఇవన్నీ ఒకెత్తయితే.. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఆమె నటించబోతుండడం మరో కొసమెరుపు.

గతంలో ఊపిరి అనే సినిమా తీశాడు వంశీ పైడిపల్లి. ఇందులో ముందుగా శృతిహాసన్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆఖరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి శృతి తప్పుకుంది. దీనివల్ల సినిమా షూటింగ్ ఇంకాస్త ఆలస్యమైంది. అప్పట్లో ఈ వ్యవహారం కోర్టు నోటీసు వరకు వెళ్లింది. శృతితో వంశీ పైడిపల్లికి ఇలాంటి చేదు అనుభవం ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మహేష్ మూవీ కోసం శృతిహాసన్ ను తీసుకుంటున్నాడు వంశీ పైడిపల్లి.