నితిన్ అస్సలు తగ్గట్లేదుగా!

ఇప్పటికే 3 సినిమాలు ప్రకటించాడు. గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఆ మూడూ సెట్స్ పై ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో సినిమా కూడా ప్రకటించాడు నితిన్. అవును.. నితిన్ హీరోగా మరో సినిమా ఎనౌన్స్ అయింది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ అనే సినిమా చేయబోతున్నాడు నితిన్. ఈ రెండు పేర్లు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది కదా. నిజమే.. కృష్ణచైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమా చాన్నాళ్ల కిందటే మొదలవ్వాలి. కానీ ఛల్ మోహన్ రంగ ఫ్లాప్ తో ఈ సినిమా పక్కకెళ్లిపోయింది.

ఇన్నాళ్లకు ఈ మూవీపై క్లారిటీ వచ్చింది. క్రిష్ణ చైతన్యకు మరోసారి అవకాశం ఇవ్వాలని నితిన్ నిర్ణయించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు బయటకు రావడానికి చాలా టైమ్ పడుతుంది.

ప్రస్తుతం భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్. అది పూర్తయిన వెంటనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చదరంగం’ అనే సినిమాను పూర్తిచేస్తాడు. దీంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే’ పవర్ పేట’ మొదలవుతుంది.