ఢిల్లీ ఓటమి… బీజేపీ పోస్టుమార్టం

ఢిల్లీ ఓటమిపై బీజేపీ పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఎందుకు ఓడామనే దానిపై తాజాగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా , సీనీయర్ బీజేపీ నేతలంతా కలిసి సమాలోచనలు చేశారు.

అయితే ఇన్నాళ్లుగా గూడు కట్టుకొని ఉన్న అసంతృప్తిని ఈ భేటీలో నేతలు వెళ్లగక్కినట్టు తెలిసింది. ప్రధానంగా ఓటమికి సీఏఏ, ఎన్నార్సీ లాంటి వాటిపై బీజేపీ దూకుడే కొంప ముంచిందని నేతలు అభిప్రాయపడ్డారట.. జాతీయ ఎన్నికల్లో పనిచేసిన జాతీయవాదం.. రాష్ట్ర ఎన్నికల్లో పనిచేయదని.. అది ఓట్లు రాల్చలేదని గుర్తించారు.

అయితే బీజేపీ మాత్రం పైకి అధికారికంగా ఢిల్లీలో ఓటమికి ప్రతిపక్ష కాంగ్రెస్ బలంగా లేకపోవడమే ద్విముఖ పోరులో ఓటమికి కారణాలని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం బీజేపీ.. రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు మొదలు పెట్టిందట. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈనేపథ్యంలో అక్కడ వేరే ప్రచార అస్త్రాలను వెతకాలని ఆలోచిస్తోంది.

మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఏకంగా 18 సీట్లను సాధించింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి పట్టం కడతారా? షరా మామాలుగానే రాష్ట్ర పార్టీలను గెలిపిస్తారా? అన్నది కమలదళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.