‘నాన్నకు ప్రేమతో’… అంటున్న జూనియర్ ఎన్టీఆర్

నందమూరి ఫ్యామిలీ హీరోలు ఇండస్ట్రీలో తమకంటూ ఓ క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు పెద్ద సంఖ్యలో అభిమానగణం ఉంది. బాలకృష్ణ, కల్యాణ్ రామ్ నటిస్తూనే సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకొని నిర్మాతలుగా రాణిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

బాలయ్య బాబు ‘ఎన్బీకే’ సంస్థను ఏర్పాటు చేసి తన మూవీలను రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఏర్పాటు చేసి మూవీలను నిర్మిస్తున్నాడు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి పేరుతో ‘నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ బ్యానర్’ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను నిర్మించనున్నాడు.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా… మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. అలాగే కల్యాణ్-హారిక-హాసిని సంయుక్తంగా నిర్మించనున్న మరో మూవీ లోనటించనున్నాడు.

ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, రాంచణ్ సొంత నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకొని సినిమాల్లో వాటాలను అందుకుంటున్నారు. త్వరలోనే ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చేరిపోవడం ఖాయంగా కన్పిస్తుంది.