మే నెలలో అసలైన పోటీ

కరోనా ప్రభావం టాలీవుడ్ పై గట్టిగా పడింది. ఈ వైరస్ దెబ్బకు షూటింగ్స్ అన్నీ కాన్సిల్ అయ్యాయి. రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడీ వైరస్ మరో రకంగా టాలీవుడ్ లో ఓ ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. అవును.. సినిమాలన్నీ ఇప్పుడు ఒకేసారి వచ్చి మే నెలపై పడ్డాయి. దీంతో సినిమాల మధ్య పోటీ పెరిగిపోయింది. ఎవరికి వారు ఇప్పట్నుంచే లాబీయింగ్స్ మొదలుపెట్టారు.

నాని-సుధీర్ బాబు హీరోలుగా నటించిన V సినిమా లెక్కప్రకారం మార్చి 25న రిలీజ్ అవ్వాలి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అంతలోనే దిల్ రాజుకు మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ ఏప్రిల్ లో కూడా కరోనా ప్రభావం తగ్గకపోతే ఏం చేయాలి. అందుకే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడేమో.. ఏప్రిల్ నెలను కూడా స్కిప్ చేసి మే నెలకు సినిమాకు వాయిదా వేసుకున్నాడట. మరికొన్ని రోజుల్లో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

అటు ఉప్పెన సినిమా కూడా ఏప్రిల్ నుంచి మే కు పోస్ట్ పోన్ అయింది. అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ కూడా మే నెలకు వెళ్లిపోయింది. వీటితో పాటు.. నాగచైతన్య లవ్ స్టోరీ, రామ్ రెడ్, రానా అరణ్య సినిమాలు కూడా మే నెలలోనే వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

దీంతో మే నెలపై ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు మల్లగుల్లాలు పడుతున్నారు. మొన్న సంక్రాంతికి సినిమాల మధ్య ఎలాంటి పోటీనైతే చూశామో.. అంతకంటే ఎక్కువ పోటీ ఈసారి మే నెలలో కనిపించే అవకాశం ఉందని ట్రేడ్ భావిస్తోంది.