క్రీడాదిగ్గజాలతో కరోనా పై ప్రధాని సమావేశం

  • సచిన్ తో సహా 40 మందితో వీడియో కాన్ఫరెన్స్

కరోనా మహమ్మారి పీడ విరగడ చేయటానికి దేశప్రజలంతా ఏకంకావాలని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పిలుపు నిచ్చారు. తొమ్మిదిరోజుల లాక్ డౌన్ ను విజయవంతం చేసిన భారతావనికి కృతజ్ఞతలు తెలిపారు.

భారత్ కు చెందిన మొత్తం 40 మంది క్రీడాదిగ్గజాలతో ప్రధాని కొద్దిగంటల ముందు విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ పాటించడంలో ప్రజలను కార్యోన్ముఖులను చేయడంలో తమవంతు పాత్ర నిర్వర్తిస్తున్న క్రీడాప్రముఖులను ప్రధాని అభినందించారు. ప్రజలకు,తమతమ అభిమానులకు ప్రధానంగా ఐదు అంశాల గురించి వివరించాలని కోరారు.

కరోనా వైరస్ ను దేశం నుంచి తరిమికొట్టాలన్న సంకల్పాన్ని ప్రతిఒక్కరూ కలిగిఉండటం, వ్యక్తిగతంగా దూరాన్నిపాటించడం, శుభ్రతపాటించడం, లాకౌడౌన్ పరమితి ముగిసేవరకూ ఇంటికే పరిమితం కావడం, కరోనా వైరస్ తో పోరాడుతున్న వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందిని, పోలీసు సిబ్బందని, తమకోసం పాటుపడుతున్న వివిధ వర్గాల ఉద్యోగులను గౌరవించడం, ఆపన్నులను ఆదుకోవడం లాంటి పనులు చేసేలా ప్రజలను ఉత్తేజితులను చేయాలని కోరారు.

సచిన్, కొహ్లీ, గంగూలీ…..

ఈ వీడియో సమావేశంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, పీటీ ఉష, విశ్వనాథన్ ఆనంద్, పుల్లెల గోపీచంద్, హిమదాస్, బజరంగ్ పూనియా, పీవీ సింధు,రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తో సహా వివిధ క్రీడలకు చెందిన మొత్తం 40 మంది ఈ సమావేశంలో పాల్గొని తమతమ అభిప్రాయాలను, అనుభవాలను ప్రధానితో పంచుకొన్నారు.

ప్రజలు శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేలా స్ఫూర్తి నింపాలని, ఆత్మస్థైర్యాన్ని నింపేలా చూడాలని క్రీడాదిగ్గజాలకు ప్రధాని సూచించారు.

కరోనా బాధితులకు అసమానసేవలు అందిస్తున్న వైద్యులు, నర్సుల, ఆరోగ్య,వైద్యశాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా చీకటిని పారద్రోలండి…

దేశాన్ని ఆవరించిన కరోనా వైరస్ అనే చీకటిని పారద్రోలటం కోసం దేశప్రజలంతా…ఏప్రిల్ 5 రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిముషాల వరకూ… తమతమ నివాసాలలోని విద్యుత్ దీపాలను స్విచాఫ్ చేసి… కొవ్వొత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లను ఆన్ చేయాలని, హిందూ సాంప్రదాయాన్ని పాటించేవారు… దీపారాధన చేయాలని ప్రధాని తన సందేశంలో కోరారు. ఇదే అంశాన్ని క్రీడాదిగ్గజాలతో సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని చర్చిచారు.