89 వ పడిలో తండ్రికాబోతున్న ఫార్ములావన్ బాస్

  • వయసుతో పని లేదన్న బెర్నీ ఎకెల్ స్టోన్

ఫార్ములావన్ చరిత్రలో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన బెర్నీ ఎకెల్ స్టోన్…వ్యక్తిగత జీవితంలోనూ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. గంటకు 360 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఫార్ములావన్ రేస్ ల సర్క్యూట్ ను అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఘనత సాధించిన.. మాజీ బాస్ బెర్నీ ఎకెల్ స్టోన్ 89 సంవత్సరాల లేటు వయసులో తండ్రికాబోతున్నట్లు ప్రకటించాడు.

తనజీవితంలో ఇప్పటికే ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురు ఆడపిల్లలకు తండ్రిగా ఉన్న బెర్నీ…తన వ్యక్తిగత కార్యదర్శి, 44 సంవత్సరాల బ్రెజిల్ మహిళ ఫాబియానో ఫ్లోసీని మూడో పెళ్లి చేసుకొన్న తర్వాత మరోసారి తండ్రికాబోతున్నట్లు తెలిపాడు.

తనకు మగబిడ్డ జన్మించబోతున్నట్లు, ఈ వార్త విని తన కుటుంబసభ్యులు ఎంతో సంతోషానికి గురయ్యారని, తన కుమార్తెలు ఆనందంగా ఉన్నారని తెలిపాడు.

తండ్రి కావడానికి వయసుతో పనిలేదని, తన దృష్టిలో 89 సంవత్సరాల వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని… 29 కి, 89కి తేడా ఏమీలేదని తనదైన స్టయిల్ లో చెప్పాడు.

జులై నెలలో ఫాబియానో పండంటి మగబిడ్డకు జన్మనివ్వనుందని, తమ జీవితాలలో ఇదో మధుర ఘట్టమని తెలిపాడు.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఫార్ములావన్ రేస్ లను అత్యంత విజయవంతం చేయడంలోనూ, అత్యధిక జనాదరణ పొందేలా తీర్చిదిద్దడంలో బెర్నీ, ఫాబియానో జోడీ ఎనలేని కృషి చేశారు.

ఫార్ములావన్ సర్క్యూట్ సీఈవో బాధ్యతల నుంచి గత ఏడాదే బెర్నీ తప్పుకొని…తన మూడో భార్యతో కలసి ప్రశాంత జీవనం సాగిస్తున్నాడు. ఖాళీ సమయాలలో భార్యతో కలసి షాపింగ్ కు వెళ్ళటం, విదేశీ పర్యటనలు చేయటం తన జీవనవిధానంగా మార్చుకొన్నాడు.

ఏదిఏమైనా ప్రపంచ క్రీడారంగ చరిత్రలోనే … అదీ 89 సంవత్సరాల లేటు వయసులో తండ్రికాబోతున్న తొలి క్రీడా ప్రముఖుడిగా బెర్నీ ఎకెల్ స్టోన్ రికార్డుల్లో చేరబోతున్నాడు.

బెర్నీ విదేశీయుడు కాబట్టి సరిపోయింది. అదే మనదేశంలోనైతే ముసలోడికి ఈ దసరాపండుగేంటి అంటూ ముక్కుమీద వేలేసుకొనేవారు ఎందరో మరి.