కరోనాబాధితుల సేవలో పంజాబీ పుత్తర్లు

  • జలంధర్ లోని 5వేల కుటుంబాలకు హర్భజన్ సాయం
  • కరోనా బాధితులకు యువరాజ్ 50 లక్షల విరాళం

క్రికెటర్లుగా దేశంలోని కోట్లాదిమంది అభిమానంతో పాటు వందలకోట్ల రూపాయలు సంపాదించిన పంజాబ్ కమ్ భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్.. తమ పెద్ద మనసును చాటుకొన్నారు.

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనడంలో దేశప్రజలకు, ప్రభుత్వాలకు తమవంతు సహకారం అందిస్తున్నారు. భారత్ లో ఇప్పటికే 3వేల కరోనా కేసులు బయటపడగా, 70 మంది వరకూ మృతి చెందారు.

మరోవైపు ప్రభుత్వం కరోనా కట్టడి కోసం 21 రోజుల లాక్ డౌన్ తో పాటు… ఉపాధి కోల్పోయినవారికి, అన్నార్తుల సాయం కోసం కోటీ 70 లక్షల రూపాయల ప్యాకేజీని ప్రకటించడమే కాదు… దాతల నుంచి ఆర్థికసాయాన్ని అర్థించింది.

క్రీడా ప్రముఖులు చాలామంది తమవంతుగా ఇప్పటికే ఆర్థికసాయం ప్రకటించగా… పంజాబీ పుత్తర్ హర్భజన్ సింగ్… తనవంతుగా జలంధర్ లోని 5వేల నిరుపేద కుటుంబాలకు… నిత్యం ఆహారం అందిస్తున్నాడు. తన భార్య గీతాబస్రాతో కలసి వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు.

దేవుడి దయతో తాను… తనవంతుగా సాయం చేయాలని నిర్ణయించానని… ముంబైలో నివాసం ఉంటూనే… తరచూ జలంధర్ వెళ్లి కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపాడు.

తన స్నేహితులు, పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సహకారంతో జలంధర్ లోని 5వేల నిరుపేద కుటుంబాలకు సాయం అందించగలగుతున్నట్లు చెప్పాడు.

ఒక్కో కుటుంబానికి 5 కిలోల బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె ప్యాకెట్, అవసరమైన ఇతర సామాగ్రి అందచేస్తున్నట్లు భజ్జీ ప్రకటించాడు.

సిక్సర్లకింగ్ 50 లక్షల సాయం…

మరోవైపు… సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తనవంతుగా కరోనా వైరస్ బాధితుల నిధికి 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించాడు. నరేంద్ర మోడీ పిలుపు మేరకు.. తనవంతుగా 50 లక్షలరూపాయల నిధిని ప్రధానమంత్రి సహాయనిధికి జమచేస్తున్నట్లు తెలిపాడు.

ఈ విపత్కర సమయంలో ఎవరికివారు తమకు తోచినంత పొరుగువారికి, అవసరమైనవారికి సాయం అందించాలని కోరాడు. కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలు పాటిస్తూ..అందరం కలసి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు.

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పిలుపు మేరకు…పాక్ లోని మైనార్టీ ప్రజలకు …తమవంతుగా సాయం అందించడానికి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్.. ముందుకు రావడం విమర్శలకు దారితీసింది.

అయితే…తమకు దేశంతో పాటు మనుషులూ ప్రధానమేనని…పొరుగుదేశంలోని ముస్లిమేతర మైనార్టీ ప్రజలను సైతం.. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని..ఈ ఇద్దరూ చెబుతున్నారు. షాహీద్ అఫ్రిదీ ఫౌండేషన్ కు తమవంతు సాయం అందిస్తున్నారు.