ప్రధాని పిలుపునకు క్రీడాలోకం సంఘీభావం

  • దీపాలు వెలిగించిన క్రీడాప్రముఖులు

దేశం నుంచి కరోనా మహమ్మారిని పాలద్రోలాలంటే ఐకమత్యం అవసరమంటూ…అది చాటుకోడానికి దేశంలోని ప్రజలందరూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9నిముషాల వరకూ దీపాలు వెలిగించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు అపూర్వమైన స్పందన వచ్చింది.

క్రీడా దిగ్గజాలు, క్రీడాప్రముఖలు సైతం.. తమదైన శైలిలో దీపాలు వెలిగించడం ద్వారా సంఘీభావాన్ని చాటుకొన్నారు. భారత్ అంతా ఒక్కటేనని చాటిచెప్పారు.

కుటుంబసభ్యులతో సచిన్….

భారత క్రికెటర్ భారత రత్న, రాజ్యసభ మాజీ సభ్యుడు సచిన్ టెండుల్కర్ ముంబైలోని తన నివాసంలో భార్య,పిల్లలతో కలసి..విద్యుత్ దీపాలు స్విచాఫ్ చేసి.. దీపాలు వెలిగించడం ద్వారా తన సంఘీభావాన్ని చాటుకొన్నాడు.

దేశాన్ని ఆవరించిన కరోనా వైరస్ అనే చీకటిని తరిమికొట్టాలంటే…దీపాలు, జ్యోతులు వెలిగించడమే అత్యుత్తమమని ప్రకటించాడు. లాక్ డౌన్ కాలంలో అందరూ ఇంటిపట్టునే ఉండి..తమను తాము కాపాడుకోడం ద్వారా సమాజాన్ని, దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చాడు.

విరాట్-అనుష్క వెలుగులు..

2020 ఏప్రిల్ 5, ఆదివారం రాత్రి 9 గంటలు కాగానే…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన భార్య అనుష్క, తమ పెంపుడు శునకంతో కలసి తన నివాసంలో దీపం వెలిగించడం ద్వారా తన సంఘీభావాన్ని తెలిపాడు.

ప్రజలంతా ఏకతాటిమీద నిలబడి…కరోనా వైరస్ ను అధిగమించాలని తన సందేశంలో కోరాడు. ప్రధాని కొద్దిరోజుల మందు నిర్వహించిన క్రీడాప్రముఖుల వీడియో కాన్ఫరెన్స్ లో విరాట్ కొహ్లీ పాల్గొన్నాడు.

మేరీ కోమ్ టార్చ్ లైట్…

భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తన నివాసంలో భర్త, ముగ్గురు పిల్లలతో కలసి…సెల్ పోన్ టార్చ్ లైట్ వెలిగించడం ద్వారా తనవంతు పాత్ర నిర్వర్తించింది. ప్రధాని పిలుపుమేరకు తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని వివరించింది.

సురేశ్ రైనా సైతం తన భార్య ప్రియాంక, కుమార్తెతో కలసి… తన ఇంటి టెరెస్ పైన దీపాలు వేలిగించాడు. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్న లక్షలాదిమంది వైద్యసిబ్బంది, పారిశుధ్ద్య సిబ్బంది, పోలీసు, మీడియా సిబ్బంది చేస్తున్న సేవలు నిరుపమానమని, వారికి సంఘీభావంగా జ్యోతి వెలిగించామని వివరించాడు.

హర్భజన్ సింగ్, సైనా, బజరంగ్ సైతం…

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన భార్య గీత, కుమార్తెతో కలసి తన నివాసంలో దీపం వెలిగించగా…బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ హైదరాబాద్ లోని తన నివాసంలో జ్యోతి వెలిగించడం ద్వారా సంఘీభావం ప్రకటించింది.

కుస్తీలో భారత మేటి భజరంగ్ పూనియా, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తమతమ నివాసాలలో దీపాలు వెలిగించడం ద్వారా తమ సంఘీభావాన్ని చాటుకొన్నారు.

9 నిముషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో భారత్ లోని 130 కోట్ల మంది ప్రజలతో పాటు… దక్షిణాసియా సమాఖ్య దేశాలు శ్రీలంక, పాకిస్థాన్, భూటాన్‌, బంగ్లాదేశ్, నేపాల్, అప్ఘనిస్థాన్, మాల్దీవుల ప్రజలు సైతం పాలుపంచుకోడం విశేషం.