గర్భంతో ఉన్న భార్య, చిన్నారిని చక్రాల బండిపై 700 కిమీలు తీసుకెళ్ళిన వలస కార్మికుడు

అతడో వలస కార్మికుడు. ఉపాధి కోసం మధ్య ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ఉపాధి కరువైంది. జీవనోపాధికి కూలి పనులు దొరకక.. తిండి లేని స్థితిలో 700 కిలో మీటర్ల దూరంలోని స్వగ్రామానికి కాలినడకన బయలు దేరాడు.

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన రాము సొంతూరికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. కానీ సొంతూరుకి వెళ్లడానికి బస్సుగానీ, ట్రక్ గానీ అతడికి దొరకలేదు. రైళ్లో వెళ్లడానికి కూడా సరిపోయేంత డబ్బులేదు.

దీంతో చిన్నారిని భుజాలపై మోస్తూ.. గర్భవతైన భార్యతో కలసి ప్రయాణం మొదలు పెట్టాడు. కొంత దూరం వెళ్లాక తనకు అర్థమైంది. తన భార్య నడవలేకపోతోందని.. తాను కూడా చిన్నారిని మోస్తూ అంత దూరం నడవలేనని అనుకున్నాడు. వెంటనే చిన్న చిన్న వస్తువులు సేకరించి ఒక తాత్కాలిక బండిని సిద్దం చేశాడు. భార్య, పిల్లలను దానిపై కూర్బోబెట్టి లాగుతూ తన ఊరివైపు ప్రయాణం కొనసాగించాడు. కలిచివేసే ఈ దృశ్యాన్ని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

‘తాను ఎలాగైనా సొంతూరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందరం కలిసి నడవడం సాధ్యం కాదని తేలడంతో ఇలా తాత్కాలిక బండిని సిద్దం చేశాను. అడవిలో దొరికిన చెక్కలతోనే ఈ బండి తయారు చేశాను. రోజుల తరబడి ఏమీ తినకుండానే గ్రామానికి చేరుకున్నాను’ అని రాము చెప్పాడు.

మహారాష్ట్రను దాటి మధ్యప్రదేశ్‌లోని తన సొంత జిల్లాకు చేరుకోగానే.. వీరిని చూసిన డీఎస్పీ నితేష్ భార్గవ వారికి ఆహారం, బిస్కెట్లు అందించారు. రాము కూతురికి కొత్త చెప్పులు కూడా కొనిచ్చారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి బాలాఘాట్‌లోని స్వగ్రామానికి ఒక వాహనం ఇచ్చి పంపించారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వారికి చెప్పారు.