తిరిగొచ్చేవారితోనూ ఇబ్బందే

ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ సమావేశానికి హాజరై తిరిగి వచ్చిన వారివల్లే కరోనా వ్యాధి వ్యాపించిందన్న ప్రచారం సద్దుమణగక ముందే మరో వ్యవహారం తెలంగాణా ప్రభుత్వాన్ని కలచి వేస్తోంది.

వలస కార్మికులు ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైన వారు కాదు. ఒక రాష్ట్రానికి చెందిన శ్రామికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఉపాధి వెతుక్కుంటే… ఆ రాష్ట్రం వారు మరో రాష్ట్రంలో వలస కార్మికులుగా ఉండవచ్చు.

తెలంగాణా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి వస్తున్నారు. ఇంతవరకు 41 వేల మంది అలాంటి కార్మికులు తిరిగొచ్చారు. వీరిలో 30,000 మంది ఒక్క మహారాష్ట్ర నుంచే తిరిగివచ్చారు. వారం రోజుల కింద తెలంగాణాలో కరోనా తగ్గు ముఖం పడ్తోందనుకుంటున్న సమయంలో గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రానికి తిరిగొచ్చిన 21 మంది వలస కార్మికులు కరోనా బారిన పడడం మరింత ఆందోళనకరంగా తయారైంది.

గత నెల నుంచి ఒక్క కరోనా కేసు కూడా లేని కొన్ని జిల్లాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వల్ల అక్కడ కూడా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుందేమోనన్న భయం రాష్ట్ర ఉన్నతాధికారుల్లో కనిపిస్తోంది. గత 40 రోజుల్లో ఆరు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందేమోనన్న దిగులు పీడిస్తోంది.

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు ఎవరు అని గుర్తించడం కూడా కష్టమే. ఎందుకంటే కొంత మంది కాలి నడకన వస్తున్నారు. మరి కొందరు సొంత వాహనాల మీద వస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కరోనా పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని కనిపెట్టగలిగిన వారిని క్వారంటైన్ కు పంపిస్తున్నారు. వీరికి తోడు దాదాపు 700 మంది విదేశాల నుంచి వచ్చారు. వీరిని వివిధ హోటళ్లలో ఉంచుతున్నారు.