రాజమౌళి చేతిలో ఆచార్య భవిష్యత్తు

లాక్ డౌన్ ముగుస్తోంది. మరో 2 వారాల్లో షూటింగ్స్ మొదలవుతాయి. ఆచార్య, ఆర్ఆర్ఆర్, వకీల్ సాబ్ లాంటి పెద్ద సినిమాలు మళ్లీ సెట్స్ పైకి వస్తాయి. ఎవరికి వాళ్లు అంతా షెడ్యూల్స్ కు రెడీ అవుతున్నారు. కానీ ఆచార్య టీమ్ మాత్రం తమ షూటింగ్ ను రాజమౌళి చేతిలో పెట్టింది. అవును.. ఓ కీలకమైన విషయంపై రాజమౌళి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అతడు ఓకే అంటే ఆచార్య షూట్ స్టార్ట్ అవుతుంది. లేదంటే లేదు.

ఆచార్యకు సంబంధించి రామ్ చరణ్ కావాలి. చరణ్ తో 30 రోజుల షూట్ ఉంది. సినిమాలో చాలా కీలకమైన పాత్ర అది. ఆ షూట్ చేయాలంటే రాజమౌళి అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే ఆచార్య సెట్స్ పైకి చరణ్ వెళ్తే.. ఆర్ఆర్ఆర్ మరింత ఆలస్యం అవుతుంది.

మరోవైపు రిలీజ్ డేట్ విషయంపై కూడా రాజమౌళి వైపు చూస్తోంది ఆచార్య యూనిట్. సంక్రాంతి నుంచి ఆర్ఆర్ఆర్ అఫీషియల్ గా తప్పుకున్నట్టు తెలిస్తే.. ఆ తేదీకి ఆచార్యను తీసుకురావాలనేది చిరంజీవి ప్లాన్. దీనిపై కూడా రాజమౌళి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇలా ఆచార్యకు సంబంధించి రెండు కీలకమైన విషయాలు ఇప్పుడు రాజమౌళి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయి.