ఆ రీమేక్ ను పవన్ వద్దనుకున్నాడు

టాలీవుడ్ లో బాగా చర్చనీయాంశమైన రీమేక్ డ్రైవింగ్ లైసెన్స్. మలయాళంలో పెద్ద హిట్టయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనేది చాలామంది నిర్మాతల ఆలోచన. ఓ బడా నిర్మాత మాత్రం మరో అడుగు ముందుకేశాడు. ఏకంగా పవన్ ను కలిసి రీమేక్ ప్రతిపాదన తీసుకొచ్చాడు.

ఎందుకంటే..తెలుగు రీమేక్ రైట్స్ కింద చాలా భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మలయాళ నిర్మాతలు. అంత డబ్బు పెట్టి రీమేక్ రైట్స్ కొని, నిర్మించి, రిలీజ్ చేసి ప్రాఫిట్స్ రాబట్టాలంటే పవన్ లాంటి హీరో ఉండాల్సిందే.

అయితే నిర్మాతకు పవన్ నుంచి రెడ్ సిగ్నల్ పడింది. డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో తను నటించనని పవన్ తేల్చి చెప్పేశాడు. నిజానికి ఈ సినిమాను పవన్ చూడలేదు. ఓ దర్శకుడు ఇచ్చిన నెరేషన్ మాత్రమే విని ఈ నిర్ణయానికొచ్చాడు. దీంతో సదరు నిర్మాత పవన్ కోసం ప్రత్యేకంగా ప్రివ్యూ ఏర్పాటుచేస్తానని మాటిచ్చాడు. అయినప్పటికీ పవన్ ఈ స్టోరీపై పెద్దగా ఆసక్తి చూపించలేదు.

డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో ఓ స్టార్ హీరో పాత్ర ఉంటుంది. సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి స్టార్ హీరో పాత్రను, పవన్ పోషిస్తేనే బాగుంటుందని భావిస్తున్నారట. మరి పవన్ ఎందుకు ఈ రీమేక్ కు నిరాకరించాడో ఆయనకే తెలియాలి.