నాని కోసం కోల్ కతా సెట్

మంచి కథలే కాదు, వాటికి మంచి నేపథ్యాలు కూడా ఎంచుకుంటున్నారు దర్శకులు. ఒకప్పటిలా రెగ్యులర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడం లేదు. ఉదాహరణకు రంగస్థలం సినిమానే తీసుకుంటే.. ఆ కథను ఈ కాలంలో జరిగినట్టు కూడా తీయొచ్చు. కానీ సుకుమార్ మాత్రం 80ల నాటి బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు. అదే సినిమాకు పెద్ద ఎస్సెట్ గా మారింది. ఇప్పుడు ఇదే ఫార్మాట్ ను నాని సినిమా కోసం కూడా ఫాలో అవుతున్నారు.

త్వరలోనే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. దీనికి శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కథ ప్రకారం ఈ సినిమాకు కోల్ కతా సెట్ వేయబోతున్నారు. అది కూడా ఇప్పటి కోల్ కతా కాదు. 80ల నాటి కోల్ కతా నగరాన్ని ప్రతిబింబించేలా సెట్ వేయబోతున్నారు. ఇందులో ఓ పాత్ర కోసం ఈ బ్యాక్ డ్రాప్ అవసరం అంటున్నాడు దర్శకుడు.

ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు నాని. ఇది థియేటర్లలోకి వచ్చిన వెంటనే శ్యామ్ సింగరాయ్ ప్రారంభమౌతుంది. మొన్నటివరకు ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే టక్ జగదీష్ తర్వాత తమ సినిమా శ్యామ్ సింగరాయ్ నే ఉంటుందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ క్లారిటీ ఇచ్చింది.