వీళ్లిద్దరూ విడిపోయారు… ఆ ఇద్దరు కలిశారు

2 రోజులుగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే, సమంత ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మజిలీలో సమంత ఏమంత అందంగా లేదంటూ పూజా హెగ్డే సోషల్ మీడియా వాల్ పై పోస్టు పడింది. ఆ పోస్ట్ కు తనకు సంబంధం లేదంటోంది పూజా హెగ్డే. తన ఎకౌంట్ హ్యాక్ అయిందని వాదిస్తోంది.

అటు సమంత ఫ్యాన్స్ మాత్రం పూజా హెగ్డే కావాలనే ఇలా చేస్తోందని, ఆమె సమంతకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సమంతకు మద్దతుగా చిన్మయి, నందినీరెడ్డి లాంటి వాళ్లు కూడా రంగంలోకి దిగిపోయారు. మొత్తానికి ఈ ఒక్క పోస్ట్ తో సమంత-పూజాహెగ్డే మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అదే టైమ్ లో సమంతకు బాగా దగ్గరైపోయింది మరో హీరోయిన్ రష్మిక.

రీసెంట్ గా ఫ్యాన్స్ తో ఛాట్ చేసిన సమంత.. తనకు రష్మిక అంటే చాలా ఇష్టమని ప్రకటించింది. మరీ ముఖ్యంగా రష్మిక డాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఊహించని విధంగా సమంత నుంచి ఇలాంటి స్పందన వచ్చేసరికి రష్మిక ఉబ్బితబ్బిబ్బయింది. థ్యాంక్ యూ సమంత అంటూ స్పందించింది. మొత్తానికి 3 రోజుల గ్యాప్ లో సమంతకు పూజాహెగ్డే శత్రువుగా మారితే.. రష్మిక మంచి ఫ్రెండ్ అయిపోయింది.