ఢిల్లీకి జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. హఠాత్తుగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం అమిత్ షా ఫోన్ చేసినప్పుడు జగన్‌మోహన్ రెడ్డి ఆయన అపాయింట్‌మెంట్‌ కోరినట్టు వార్తలొస్తున్నాయి. కరోనా  సమయంలోనూ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారంటే అందుకు బలమైన కారణాలుంటాయని భావిస్తున్నారు.

జగన్‌ ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రానికి సాయంతో పాటు… రాజకీయ పరిణామాలను కూడా వివరించే అవకాశం ఉంది. ముఖ్యంగా హైకోర్టులో వరుసగా కొందరు పిటిషన్లు వేయడం,… హైకోర్టు నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడం వంటి పరిణామాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అసంతృప్తితో ఉంది.

పాలన ముందుకు సాగకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే కోర్టులో కొందరు పిటిషన్లు వేస్తున్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తోంది. ఏడాదిలోనే 64 జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం కూడా దీనిపై గట్టిగానే దృష్టి పెట్టిందని చెబుతున్నారు.

పరిపాలనలో న్యాయస్థానాలు మరీ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్న విషయాన్ని అమిత్ షాకు జగన్‌మోహన్ రెడ్డి వివరించే అవకాశం ఉందంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వివాదంపైనా కేంద్ర పెద్దలతో జగన్‌ చర్చించనున్నారు.

అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా వీలునుబట్టి జగన్‌ కలిసే అవకాశం ఉంది.