కోవిడ్-19 రోగి అదృశ్యం… 8 రోజుల తర్వాత ఆసుపత్రి బాత్రూంలో శవంగా…

మన దేశాన్ని ఒక వైపు కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంటే.. మరో వైపు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి అత్యంత దైన్యంగా ఉంది. సరైన వసతులు లేక, వైద్యం అందక రోగులు పడుతున్న బాధలు ఇటీవల ఎన్నో బయటకు వచ్చాయి. ఇక ఈ ఘటన తెలుసుకుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మహారాష్ట్రలోని జల్ గావ్ నగరంలోని ఒక ఆసుపత్రి నుంచి 8 రోజుల క్రితం ఆసుపత్రి నుంచి అదృశ్యమైన 82 ఏండ్ల వృద్ధురాలు.. బుధవారం అదే ఆసుపత్రి బాత్రూంలో విగతజీవిగా కనిపించింది. జల్ ‌గావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వారాల క్రితం సదరు వృద్దురాలు కరోనా చికిత్స నిమిత్తం చేరింది. అయితే జూన్ 2 నుంచి ఆమె కనిపించడం లేదని బంధువులకు తెలియజేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆసుపత్రి నుంచి ఎలా అదృశ్యమవుతుందని ఆరా తీయగా.. చివరకు ఆమె బాత్రూంలో ప్రాణాలు కోల్పోయి కనపడింది.

ఈ విషయాన్ని మృతురాలి మనుమడు స్థానిక బీజేపీ నేతకు తెలియజేయగా.. అతను మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ట్వీట్ చేశారు. తనకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

దేశంలో అత్యధిక కేసులతో మహారాష్ట్ర రికార్డు సృష్టిస్తోంది. అంతే కాకుండా ఆసుపత్రుల్లో మరణించే రోగుల మృతదేహాలు తారుమారు అయిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. ముంబైలో ఆరు మృతదేహాలు ఎవరివో తెలియకపోవడంతో వాటికి మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు తమ బంధువుల మృతదేహాలు అప్పగించాలని చాలా మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అదృశ్యమైన 80 ఏండ్ల వృద్దుడు బోరివలి రైల్వే స్టేషన్ సమీపంలో శవమై తేలాడు. మా తాతయ్య ఆసుపత్రిలో చేర్చిన తర్వాత అదృశ్యమైన విషయం కూడా తెలుపలేదు. కానీ అతడు రైల్వే స్టేషన్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. దీనికి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చెప్పాడు.