కరోనా నయం చేశారు… బిల్లు రూ.8 కోట్లు వేశారు..!

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఆ వ్యాధి తమకు వస్తే ఏం చేయాలా అని అందరూ మథనపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరినా వ్యాధి నయమవుతుందనే గ్యారెంటీ లేకుండా పోయింది. దీనికి అక్కడ వైద్యులు, సిబ్బంది కొరతే కాకుండా సరైన సౌకర్యాలు లేకపోవడమే.

ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా బారిన పడి అడ్మిట్ అయ్యాడు. అతడికి కష్టపడి వైద్యం చేసి కరోనా బారి నుంచి రక్షించారు. కానీ సదరు రోగి ఆనందం మాత్రం బిల్లు చూడగానే మటుమాయం అయ్యింది. ఎందుకంటే చికిత్సకు అయిన ఖర్చు అంటూ రూ. 8 కోట్ల బిల్లు చేతిలో పెట్టారు.

అమెరికాలో వాషింగ్టన్‌కు చెందిన మైఖేల్ అనే 70 ఏండ్ల వృద్ధుడు మార్చి 4న అనారోగ్యంతో ఒక ఆసుపత్రిలో చేరాడు. అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనాగా నిర్థారించి చికిత్స ప్రారంభించారు. దాదాపు 62 రోజుల పాటు కరోనాతో పోరాడిన మైఖేల్ ఎట్టకేలకు వ్యాధి నుంచి బయటపడ్డాడు. అతడు కోలుకొని మే 5న డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్లిపోయాడు.

అతను ఇంటికెళ్లిన తర్వాత ఆసుపత్రి నుంచి బిల్లు వచ్చింది. మొత్తం 181 పేజీలున్న ఈ బిల్లులో అతడికి ఏ చికిత్స చేశారు, ఏ మందులు ఇచ్చారు, ఏ పరీక్షలు జరిపారు, ఏ ఆహారం ఇచ్చారు తదితర వివరాలన్నీ పొందు పరిచారు. అంతే కాకుండా 42 రోజుల పాటు ఐసీయూలో ఉన్నందుకు రోజుకు 9,736 డాలర్లు, వెంటిలేషన్‌పై 29 రోజులు ఉన్నందుకు రోజుకు 82 వేల డాలర్లు చార్జ్ చేశారు. మొత్తం కలిపి 1.1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 8 కోట్లు కట్టాలని కోరింది. ఈ బిల్లు చూసి మైఖేల్ అదురుకున్నాడు.

అయితే, అమెరికాలో వృద్ధుల ఆరోగ్య బీమా పథకం మైఖేల్‌కు వర్తిస్తుంది కాబట్టి పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది మాత్రం అతడికి ఊరట.