షేక్‌పేట్‌ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

హైదరాబాద్‌ షేక్‌పేట్ ఎమ్మార్వోగా పనిచేసిన సుజాత భర్త ఆజయ్‌ సూసైడ్‌ చేసుకున్నారు. అశోక్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సుజాత ఇటీవలే ఏసీబీ కేసులో పట్టుబడింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉంది. బంజారాహిల్స్‌లోని ఓ భూమి కేసులో ఆర్‌ఐతో కలిసి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. చివరకు 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో ఎమ్మార్వోతో పాటు ఇతర అధికారులు అరెస్టు అయ్యారు.

సుజాత ఇంట్లో ఏసీబీ సోదాల్లో 30 లక్షల రూపాయల నగదు దొరికింది. ఈ డబ్బు గురించి భర్త ఆజయ్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. ఉస్మానియా యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆజయ్‌…ఈ వ్యవహారంతో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. భార్య అవినీతి విషయంలో కూడా డిప్రెషన్‌కు గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం.

చివరిసారిగా తన సోదరి ఇంటికి వెళ్లి మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.