ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను… కానీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో దాదాపు అన్ని చిత్రపరిశ్రమలో నెపొటిజంపై, డిప్రెషన్ పై చర్చ మొదలైంది. ఇందులో భాగంగా చాలామంది నటీనటులు తాము ఎదుర్కొన్న ఒత్తిడి గురించి బయటపెడుతూ వస్తున్నారు. మొన్నటికిమొన్న ప్రకాష్ రాజ్ స్పందించగా.. తాజాగా ఈ జాబితాలోకి బిగ్ బాస్ బ్యూటీ నందినీరాయ్ కూడా చేరింది.

2015లో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఫ్లాప్ తో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట నందినీరాయ్. అప్పటికే చేతికి అందివచ్చిన 2 సినిమాలు ఆగిపోవడంతో నందిని రాయ్ కోలుకోలేకపోయిందట. ఆ టైమ్ లో తనకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని, మేడపై నుంచి దూకేయాలని, చేయి కోసుకోవాలని అనిపించిందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

అయితే మానసిక స్థైర్యంతో, వైద్యుల సూచనలతో ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది నందినీ. ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు రాకపోయినా భయంలేదని, వేరే రంగం వైపు అడుగులు వేస్తున్నానని చెప్పుకొచ్చింది. లండన్ లో ఎంబీఏ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పాఠాలు నేర్చుకుంటోంది. అందులో పెట్టుబడులు పెడుతోంది. ఇకపై దాన్నే ఫుల్ లెంగ్త్ కెరీర్ గా మలుచుకునే ఆలోచనలో ఉంది.