బిత్తిరి సత్తి రాజీనామా వెనుక ఇదేనా కారణం..?

వీ6 ఛానల్ తీన్మార్ వార్తలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సంపాదించిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి తాజా రాజీనామా సోషల్ మీడియాలో పెద్ద వార్తగా మారింది. వీ6లో రాజీనామా చేసినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే టీవీ9 వంటి పెద్ద ఛానల్‌కు వెళ్తున్నాడని సరిపెట్టుకున్నారు. కానీ, తాజాగా టీవీ9ను కూడా వదిలేయడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

సత్తి టీవీ9కు రాజీనామా వెనుక పలు వార్తలు వస్తున్నా.. అసలు కథనం మాత్రం వేరే ఉందట. ఈ విషయాన్ని అతను స్వయంగా సన్నిహితులకు కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మా టీవీ నిర్వహించే బిగ్ బాస్ షో 4వ సీజన్ కోసం సత్తిని సంప్రదించారట. చివరి నిమిషంలో రాజీనామా, ఇతర అంశాలు తెరపైకి రావడం ఇష్టం లేక ముందుగానే ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం.

బిగ్‌బాస్ షో ప్రారంభమయితే ఇంటికి, కుటుంబానికి దూరంగా కొన్ని వారాలు గడపాల్సి ఉంటుంది. హడావిడిగా చివరి నిమిషంలో రాజీనామా చేసేదాని కంటే ముందుగానే బయటకు వచ్చేస్తే ఒక పనైపోతుందని రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీ6లో, ప్రస్తుతం టీవీ9లో బిత్తిరి స‌త్తితో పాటు వార్త‌లు చ‌దివి పాపులారిటీ ద‌క్కించుకున్న శివ‌జ్యోతి కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొన్న విష‌యం తెలిసిందే.