బుల్లితెరపై మళ్లీ రిపీట్స్ మొదలు

ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన తర్వాత ముందుగా సెట్స్ పైకి వచ్చినవి సీరియల్స్ మాత్రమే. ఇండోర్ షూటింగ్స్ తో పాటు తక్కువ సిబ్బందితో పని పూర్తవ్వడం లాంటి అనుకూలతల వల్ల సీరియల్స్ చకచకా మొదలయ్యాయి. దాదాపు ఛానెల్స్ అన్నీ సోమవారం నుంచి తమ సీరియల్స్ కు సంబంధించి కొత్త ఎపిసోడ్స్ ప్రసారం చేయడం ప్రారంభించాయి. ఇలా అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న టైమ్ లో మరోసారి సీరియల్స్ పై దెబ్బపడింది.

అవును.. నిన్నట్నుంచి సీరియల్ షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. దీనికి కారణం సీరియల్ నటీనటులకు కరోనా సోకడమే. ముందుగా జీ తెలుగులో ప్రసారమయ్యే సూర్యకాంతం సీరియల్ కు సంబంధించి నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. దీంతో ఆ సీరియల్ షూటింగ్ ఆపేశారు. ఆ తర్వాత మరో సీరియల్ లో ఇద్దరికి కరోనా గుర్తించారు. ఆ వెంటనే అన్ని ఛానెల్స్ లో మొత్తంగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్థారించారు.

దీంతో ఛానెల్ తో సంబంధం లేకుండా షూటింగ్స్ అన్నింటినీ నిలిపివేస్తున్నట్టు టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు నటీనటులందరికీ సమాచారం వెళ్లింది.

టీవీ సీరియల్స్ ఆగిపోవడంతో మరోసారి ఛానెళ్లన్నీ ఇబ్బందుల్లో పడ్డాయి. బహుశా రేపట్నుంచి కొత్త ఎపిసోడ్లు ప్రసారమయ్యే అవకాశం లేదు. దీంతో ఛానెళ్లన్నీ మరోసారి రిపీట్ మోడ్ లో పడ్డాయి. సీరియల్స్ మరోసారి ఆగిపోవడంతో ఆ ప్రభావం ఛానెళ్లపై గట్టిగా పడే ప్రమాదముంది.