ఓటీటీలోకి మరో తెలుగు సినిమా

లాక్ డౌన్ కారణంగా థియేటర్లన్నీ బంద్ అవ్వడంతో చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఓటీటీ బాట పడుతున్నాయి. అమృతారామమ్, 47 డేస్, పెంగ్విన్ లాంటి సినిమాలు ఓటీటీతో ఒప్పందాలు చేసుకోగా.. ఇప్పుడు మరో చిన్న సినిమా కూడా ఓటీటీలోకి వచ్చింది. దానిపేరు కృష్ణ అండ్ హిజ్ లీల.

సిద్ధూ, శ్రద్ధాశ్రీనాధ్, సీరత్ కపూర్ లాంటి తారాగణం నటించిన ఈ సినిమాను రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించాడు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్-18 మోషన్ పిక్చర్స్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. సినిమా చిన్నదే అయినా, పెద్ద సంస్థల బ్యాకప్ ఉండడంతో ఓటీటీలోకి రాదని, థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు.

కానీ మంచి ఆఫర్ రావడంతో సురేష్ బాబు సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలనే నిర్ణయించారు. అలా కొన్ని గంటల కిందట కృష్ణ అండ్ హీజ్ లీల అనే సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈమధ్య కాలంలో ఓటీటీలోకి వచ్చిన ఓ కలర్ ఫుల్ సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో తెలిసిన ముఖాలున్నాయి. రొమాన్స్ ఉంది, కామెడీ కూడా ఉంది. నెటిజన్లు ఈ సినిమాను ఏ స్థాయిలో ఆదరిస్తారనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.