ట్రాక్టర్లకూ ఇసుక ఉచితం – ఏపీ ప్రభుత్వ నిర్ణయం

ఏపీ ప్రభుత్వానికి ఇసుక అంశం మాత్రం సవాల్‌గా మారింది. కఠిన చర్యల వల్ల అసలు ఇసుకే అందుబాటులో లేకుండాపోతోందన్న విమర్శలు వచ్చాయి.

పక్కనే ఇసుక రీచ్‌లు ఉన్నా స్థానికులకు కూడా అందుబాటులోకి రావడం లేదన్న అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది.

ఇప్పటికే ఎడ్ల బండిపై స్థానికులు ఉచితంగా ఇసుకను రీచ్‌ల నుంచి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సొంత అవసరాలకు, సహాయ పునరావాస ప్యాకేజ్‌ కింద నిర్మిస్తున్న నిర్మాణాలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.

సొంత అవసరాలకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లాలనుకునే వారు గ్రామ సచివాలయంలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వివరాలు నమోదు చేసుకుంటే ఎలాంటి ఫీజు వసూలు చేయకుండానే గ్రామ సచివాలయంలో అనుమతులు ఇస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది.