ఈసారి నిర్మాతగా కూడా

పవన్ హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. వరుసగా 3 సినిమాలు ఎనౌన్స్ చేశాడు. వీటిలో 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇదే స్పీడ్ లో నిర్మాతగా కూడా మారే ప్లానింగ్ లో ఉన్నాడు ఈ హీరో. అవును.. అన్నయ్య కొడుకు చరణ్ హీరోగా పవన్ ఓ సినిమా నిర్మించే ఛాన్స్ ఉంది.

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరిట పవన్ కు ఆల్రెడీ ఓ బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తానని, అందులో చరణ్ తో కూడా ఓ సినిమా ఉంటుందని గతంలో పవన్ ప్రకటించాడు. ఇదే విషయాన్ని చరణ్ కూడా అప్పట్లో నిర్థారించాడు. ఇన్నేళ్లకు ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చేలా ఉంది.

మరో రెండేళ్ల పాటు ఫుల్ లెంగ్త్ సినిమాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు పవన్. అప్పటికి ఎన్నికల హీట్ మొదలవుతుంది కాబట్టి, ఆ తర్వాత వచ్చే రెండేళ్లు పూర్తిస్థాయిలో పాలిటిక్స్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ రెండేళ్లలో నిర్మాతగా మారి చెర్రీతో సినిమా చేయాలనేది ఆలోచన. చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ కొలిక్కి వచ్చిన వెంటనే పవన్ నిర్మించాల్సిన సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.