వికాస్ దూబే ఎన్‌కౌంటర్

ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీతో పాటు 8 మంది పోలీసులను చంపేసిన మోస్ట్ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం ఉదయం పట్టుకున్న పోలీసులు… ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా ఆ సమయంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

వికాస్ దూబేను తీసుకెళ్తున్న వాహనం బోల్తా పడడంతో అదే అదనుగా వికాస్ తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆ కాల్పుల్లో వికాస్ దూబే చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.

వికాస్ ‌దూబేకు అనేక మంది రాజకీయ నాయకులు, పోలీసులతో సంబంధాలున్నాయి. వికాస్‌ దూబేను కోర్టులో ప్రవేశపెట్టి ఉంటే రాజకీయ నాయకుల బండారం బయటపడేది. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారన్న సమాచారాన్ని కూడా కొందరు పోలీసులే ఫోన్ చేసి ఇచ్చినట్టు వికాస్ దూబే అంగీకరించినట్టు సమాచారం.

అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారని ఒక పోలీస్ స్టేషన్‌ నుంచి సమాచారం రావడంతో… 25 మంది అనుచరులను రప్పించుకుని హఠాత్తుగా పోలీసులపై వికాస్ దూబే గ్యాంగు కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లోనే డీఎస్పీతో పాటు 8 మంది చనిపోయారు.

యూపీలో శాంతిభద్రతలపై అనేక విమర్శలు వచ్చాయి. దాంతో యూపీ పోలీసులు వికాస్ దూబే గ్యాంగ్ కోసం తీవ్రంగా గాలించారు. వికాస్ దూబే కంటే ముందే ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. శుక్రవారం ఉదయం వికాస్ దూబేను కూడా ఎన్‌కౌంటర్ చేశారు.