కరోనా కాలంలో నాగార్జున కొత్త సినిమా

లాక్ డౌన్ తో హీరోలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. కొత్త సినిమా సంగతి దేవుడెరుగు, కనీసం చేతిలో ఉన్న సినిమాలు కూడా పూర్తిచేయలేని పరిస్థితి. 50 దాటిన హీరోలైతే ఈ విషయంలో మరింత కఠినంగా ఉన్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు సెట్స్ పైకి వచ్చేది లేదంటున్నారు. ఇలాంటి టఫ్ టైమ్స్ లో కూడా సినిమా ఎనౌన్స్ చేశాడు నాగార్జున.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా నిర్మించనున్న భారీ చిత్రాన్ని ప్రకటించాయి. ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహిస్తారు.

ఈ చిత్రాన్ని తమ రెండు బ్యానర్ల మీద నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది.

ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నాడు నాగ్. ఈ సినిమా షూట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. థియేటర్లు ఓపెన్ అవ్వగానే రిలీజ్ చేసేలా మూవీని సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత, కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రవీణ్ సత్తారు సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు నాగ్.