కర్ఫ్యూ ఎత్తివేత… ఆగస్టు 1 నుంచి అమలు

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను పలు దశల్లో ఎత్తివేస్తున్న విషయం తెలిసిందే. రేపటితో అన్‌లాక్ 2.0 పూర్తవుతుండటంతో కేంద్ర హోం శాఖ అగస్టు 1 నుంచి అన్‌లాక్ 3.0ను అమలు చేయనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు బుధవారం కేంద్ర హోం శాఖ విడుదల చేసింది.

మార్చి 25 నుంచి అమలు చేసిన రాత్రి పూట కర్ఫ్యూను ఆగస్టు 1 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నారు. జిమ్ సెంటర్లు, యోగా సెంటర్లను అగస్టు 1 నుంచి తెరవడానికి అనుమతి ఇచ్చారు. అయితే పూర్తిగా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని నియమం విధించారు. పంద్రాగస్టు వేడుకలు కొన్ని నిబంధనలు అనుసరించి జరపాలని కేంద్రం చెప్పింది. పంచాయతీ, మున్సిపల్, సబ్‌డివిజన్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఎట్‌ హోం వేడుకలకు అనుమతి ఉంటుంది. ఈ వేడుకల సందర్భంగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

స్కూల్స్, కాలేజీలు, ట్రైనింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు, బార్లు, పబ్బులు, భారీ బహిరంగ సభలకు అనుమతులు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా మెట్రో రైళ్లను కూడా నడపకూడదని కేంద్రం ఆదేశించింది. అన్‌లాక్ 3.0 నిబంధనలు పలు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన మీదటే రూపొందించినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నట్లు ఆ మార్గదర్శకాల్లో వెల్లడించింది.

పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లో యథాతథంగా నిషేధం ఉంటుంది. కాగా అన్ని కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలోని లాక్‌డౌన్ కొనసాగింపు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిష్టానికి వదిలేసింది. ఇక కంటైన్మెంట్ జోన్లలో గతంలో లాక్‌డౌన్ సందర్భంగా ఉండే నిబంధనలే అమలులో ఉంటాయి.

ఇక అన్‌లాక్ 3.0లో కూడా అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి ఇవ్వలేదు. కేవలం హోం శాఖ అనుమతించిన విమానాలు, వందే భారత్‌కు సంబంధించిన విమానాలు మాత్రమే తిరుగుతాయి. కాగా, రాష్ట్రాల మధ్య ఆంక్షలు విధించరాదని కేంద్ర స్పష్టం చేసింది. ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. చిన్నారులు, ముసలి వాళ్ళు, ఇతర వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు ఆరోగ్య అవసరాలకు మినహా బయటకు రాకూడదని స్పష్టం చేసింది.