ఎనభై ఏళ్ల వయసు… వందలమంది లెక్కల టీచర్లకు శిక్షణ !

డబ్బు, సౌకర్యాలు, పేరు ప్రతిష్టలు…ఇలాంటివే మనిషిని ఆనందంగా ఉంచే అంశాలని అనుకుంటారు చాలామంది. కానీ చేస్తున్న పని పట్ల ప్రేమ, కుతూహలం, ఇతరులకు మేలు కలిగే పని చేయగలుగుతున్నామనే ఉత్సాహం… ఇవి అంతకంటే ఎక్కువగా ఆనందాన్ని ఇస్తాయి. అంబుజా అయ్యర్ గురించి తెలుసుకుంటే ఈ విషయాలు మనకు మరింత బాగా అర్థమవుతాయి.

ఆమె వయసు 81 సంవత్సరాలు. లెక్కల టీచరు. భారతీయ విద్యావ్యవస్థలో ఆమెకు తనదైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు సుమారు యాభై వేలమంది విద్యార్థులకు లెక్కలు చెప్పారామె. పిల్లలకు లెక్కల భయం పోగొట్టాలని వారికి అర్థమయ్యేలా మ్యాథ్స్ చెప్పాలనే తపన ఆమెలో నిరంతరం కనబడుతుంది. ఇప్పుడు ఆన్ లైన్ లోకి విద్యావిధానం మారాక …. అంతే ఉత్సాహంతో అంకిత భావంతో ఆన్ లైన్ లో లెక్కల బోధన మొదలుపెట్టారు.

ఆన్ లైన్ లో లెక్కలు చెప్పడానికి టీచర్లు సమస్యలను ఎదుర్కొంటున్న సందర్భంలో యాభైమంది లెక్కల టీచర్లతో ఒక మ్యాథ్ ఫోరమ్ ని ప్రారంభించారు అంబుజా. టీచర్లకోసం తేలిగ్గా లెక్కలు చెప్పే పలురకాల విధానాలను తయారుచేశారు. ఇప్పుడు ఈ గ్రూపులో 200 మంది లెక్కల టీచర్లు ఉన్నారు. ఇండియాలోని టీచర్లకే కాదు… దుబాయ్, అమెరికా, యుకె, ఇండోనేషియా దేశాల్లోని గణిత గురువులకు సైతం బోధన విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు.  అంతే కాదు తన యూట్యూబ్ ఛానల్లో ఆరునుండి పదోతరగతి వరకు పిల్లలకు లెక్కల బోధన చేస్తున్నారు అంబుజా అయ్యర్. ఆమె బోధన అంతా ఉచితమే.  

పిల్లలకు లెక్కల భయం పోగొట్టడమే తన ధ్యేయమని, ఆన్ లైన్, ఆఫ్ లైన్ బోధనల్లో పెద్ద తేడా లేదని, అయితే తాము చెప్పే పాఠాలను ఆసక్తికరంగా మలచుకోవటంలో టీచర్లకు తగిన సహాయం అందాలని అంబుజా అంటున్నారు.

17ఏళ్లకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంబుజా అప్పుడే లెక్కల టీచరుగా తన కెరీర్ ని మొదలుపెట్టారు. పిల్లలకు ఆమె ఏనాడూ హోం వర్క్ అంటూ ఇచ్చి ఎరుగరు. సబ్జక్టుకి సంబంధించిన బోధన, రివిజన్ లాంటివి అన్నీ క్లాస్ లోనే ముగించేస్తారామె. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందలమంది లెక్కల టీచర్లకు సబ్జక్టుకి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తున్న అంబుజా… రోజుకి ఐదు గంటల పాటు బోధించాల్సిన అంశాలకు సంబంధించిన కంటెంట్ ని తయారుచేస్తారు. తను నియమించుకున్న టైపిస్టు ద్వారా దాన్ని టైప్ చేయించి టీచర్లకు అందిస్తారు. లెక్కల టీచరుగా తన ప్రస్థానం నిరంతరం కొనసాగుతుందని… ఇప్పటికీ అదే ఉత్సాహంతో అదే తపనతో బోధన చేస్తున్నానని అంబుజా అయ్యర్ అంటున్నారు.

అవును మనిషి… తనకు నచ్చే పనిగా, ప్రేమించే పనిగా మారిపోవటం అంటే… అర్థవంతంగా జీవిస్తున్నట్టే. అర్ధవంతంగా జీవిస్తున్నపుడు అనారోగ్యాలు, ఆర్థికబాధలు, మానసిక సమస్యలు, అనుబంధాల్లో మనస్పర్థలు లాంటివి ఏవీ మన దరిదాపులకు కూడా రావు. అంత వయసులో కూడా చురుగ్గా చలాకీగా నవ్వుతూ పనిచేస్తున్న అంబుజా అయ్యర్ ని చూస్తే మనకు అది అర్థమవుతుంది.